సాక్షిప్రతినిధి, అనంతపురం: జిల్లా చరిత్రలోనే అత్యంత నీచమైన వ్యవహారం హనీట్రాప్ దందాలో తవ్వేకొద్దీ విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. కింగ్‌పిన్ రంగమ్మ మొదలెట్టిన ఈ వ్యవహారంలో ‘ఈజీమనీ’గా భావించి నాలుగు గ్యాంగ్‌లుగా విడిపోయారు. దందా మొత్తాన్ని నిశితంగా పరిశీలిస్తే టీడీపీ, బీజేపీలోని నేతల ప్రమేయంతోనే అంతా జరిగిందని స్పష్టమవుతోంది.
ముఠా పుట్టింది...విస్తరించింది ఇలా
ఓ బీజేపీ నేత తాను జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రంగమ్మకు మహిళా మోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పదవి ఇప్పించారు. అప్పట్లోనే రంగమ్మ ‘హనీట్రాప్’ మొదలెట్టారు. ఈ నేత మంత్రి సత్యకుమార్‌కు అత్యంత సన్నిహితుడు. ఇతను స్టేషన్‌కు వస్తే పనులు చేయాలని పోలీసులకు మంత్రి సూచించినట్లు తెలుస్తోంది. దీంతో మొదట ఇతనే స్టేషన్లలో పంచాయితీలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మహిళా మోర్చా రాయలసీమ జోనల్ ఇన్‌చార్జ్ చంద్రకళ, మహిళా మోర్చా మాజీ జిల్లా అధ్యక్షులు అనంతకుమారి, మల్లీశ్వరి కూడా చేరారు. ఆపై వీరి మధ్య విభేదాలతో రంగమ్మ దూరమైంది. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత ఆధ్వర్యంలో టీడీపీలో చేరింది. అక్కడి నేతల అండతో రంగమ్మ దందాను యథేచ్ఛగా నడిపించింది. ఇదే క్రమంలో అనంతకుమారి, మల్లీశ్వరి కూడా ఎవరి దందా వాళ్లు నడిపించారు. ఈ ముగ్గురు ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. అంతా ఒకేపార్టీలో పని చేసిన వారే. ఈజీమనీని ఆదాయమార్గంగా ఎంచుకుని మొత్తం నాలుగు గ్యాంగ్‌లుగా ఏర్పడి చాలామంది పరువును నాలుగు గోడల మధ్య బేరం పెట్టి అక్రమంగా సంపాదించారు. వీరితో పాటు టీడీపీలోని రాజేష్, నరేంద్రరెడ్డి కూడా రిమాండ్‌కు వెళ్లారు. రంగమ్మ, మల్లీశ్వరి ముఠాల మధ్య విభేదాలతో ఈ వ్యవహారం బయటకు పొక్కింది. హనీట్రాప్‌లో బీజేపీలో పడిన బీజం టీడీపీకి విస్తరించి ‘అనంత’ సమాజాన్ని వేధించింది.
రూ.కోట్లలో అక్రమార్జన...
మంత్రి సత్యకుమార్‌కు సన్నిహితుడైన బీజేపీ నేత ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లిలో వెంచర్ వేశారు. ఇందులో ఇటీవల వేటుపడిన ఓ సీఐ కూడా పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. పాపపు సొమ్ముతో ‘అనంత’లో రెండు ఇళ్లు కూడా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. బీజేపీలోని ఇతనితో పాటు రంగమ్మ నిర్వహించిన 7 హిల్స్ హోటల్ వద్ద సమావేశమైన టీడీపీ నేతలు కూడా ఈ డబ్బును పెట్టుబడుల కోసం వినియోగించుకున్నట్లు సమాచారం. నిజానికి ఇది చిన్న వ్యవహారం కాదని, బాధితులు కోల్పోయిన డబ్బు రూ.కోట్లలో ఉందని తెలుస్తోంది. రిమాండ్‌కు వెళ్లిన వారి కాల్‌లిస్ట్, ఆడియో రికార్డులతో పాటు బ్యాంకు లావాదేవీలను పోలీసులు శోధిస్తున్నారు. పాత్రధారులైన వ్యక్తులు, కొందరు పోలీసులపై చర్యలు తీసుకున్న డీఐజీ, ఎస్పీ సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి నీచానికి ఒడిగట్టరు.
ప్రజాప్రతినిధులు, కుటుంబసభ్యుల హస్తం..
హనీట్రాప్ దందాలో ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యుల పాత్ర ఉందని తెలుస్తోంది. ఎస్పీ చెప్పినా కేసులు నమోదు చేయని పరిస్థితి ఉందంటే, ‘ఉద్యోగం తీయగలిగే శక్తి ఎస్పీకి లేదు, ఎమ్మెల్యే చెబితే పోస్టింగ్ ఇస్తారు.. ఎమ్మెల్యేలే మా బాస్’లు అనేలా పోలీసులు ఉద్యోగం చేశారు కాబట్టి కచ్చితంగా ఈ ముడుపుల్లో కొందరు ప్రజాప్రతినిధుల పాత్ర కూడా ఉందనే అనుమానాలు కలుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని 14 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలలో మొత్తం ముగ్గురి పాత్ర స్పష్టంగా ఉందనే విషయం తెలుస్తోంది. ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టాల్సి ఉంది.
చర్యలు తీసుకోవాల్సిందే
హనీట్రాప్ అంశాన్ని విపక్షాలు తీవ్రంగా పరిగణించాయి. సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా పోలీసు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ జగదీష్‌కు వినతిపత్రం అందజేశారు. మరోవైపు హనీట్రాప్‌పై సీబీఐ విచారణ చేయాలని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి డిమాండ్ చేశారు.
‘హనీ’ తంతులో టీడీపీ, బీజేపీ నేతల ప్రమేయంపై సర్వత్రా చర్చ
మంత్రి సత్యకుమార్ అనుచరుడి పాత్రపై అనుమానాలు
బత్తలపల్లిలోని ఓ వెంచర్‌లో అతనితో పాటు వేటు పడిన ఓ సీఐ పెట్టుబడులు
రాజకీయ పార్టీ నేతల హస్తం
నేరుగా ఉండటంపై
చీదరించుకుంటున్న జిల్లా ప్రజలు


