అనంతపురం అర్బన్: ‘‘నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) మే 3వ తేదీన జిల్లాలో ఎనిమిది కేంద్రాల్లో జరగనుంది. పరీక్షకు 3,616 మంది విద్యార్థులు హాజరవుతారు. కేంద్రాల వద్ద ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి. మౌలిక సదుపాయాలు కల్పించాలి’’ అని నీట్ నోడల్ ఆఫీసర్, డీఆర్‌ఓ ఎ.మలోల అన్నారు. డీఆర్‌ఓ మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమావేశం నిర్వమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతపురంలో ఆరు, గుత్తిలో రెండు కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తాన్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. అనంత పురంలోని కేంద్రాలకు కో–ఆర్డినేటర్‌గా మార్కండేయులు సూరిని, గుత్తి పట్టణంలోని కేంద్రాలకు ఎం.మాలిక్‌సాబ్‌ను నియమించామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు. పరీక్ష వేళలకు అనుగుణంగా ఆర్‌టీసీ బస్సులు నడపాలని ఆదేశించారు. విద్యార్థులు నిర్దేశించిన పరీక్ష సమయం కంటే గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. అడ్మిట్‌కార్డుతో పాటు పాస్‌పోర్ట్ ఫొటో, ఏదేని గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలని, కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ వస్తువులు, స్టేషనరీ బుక్స్, వ్యక్తిగత వస్తువులు, ఆహార పదార్థాలు అనుమతించబోరన్నారు.
అదుపులోకి పరిస్థితి
● కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీష్
అనంతపురం అర్బన్: పెట్రోల్, డీజిల్ పంపిణీలో నెలకొన్న ఆందోళన తగ్గి పరిస్థితి అదుపులోకి వచ్చిందని కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీష్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఎస్పీతో కలిసి విలేకరులతో కలెక్టర్ మాట్లాడారు. రెండు రోజుల్లో అంతా సాధారణ స్థితికి చేరుకుంటుందన్నారు. అప్పటి వరకు బంక్‌ల వద్ద నిఘా కొనసాగుతుందన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించి వారిని ఆందోళనకు గురిచేసిన ఆరు సామాజిక మాధ్యమాలకు చెందిన వ్యక్తులకు నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. ఈ నెల 27వ తేదీతో పోలిస్తే ఇంధన నిల్వలు గణనీయంగా పెరిగాయన్నారు. రోజువారీగా పెట్రోల్ 257 కిలో లీటర్లు అవసరమైతే ప్రస్తుతం 984 కిలో లీటర్లు ఉందని ఇది నాలుగు రోజులకు సరిపోతుందని తెలిపారు. డీజిల్ రోజువారీగా 383 కిలో లీటర్లు అవసరమైతే ప్రస్తుతం 947 కిలో లీటర్లు ఉందని ఇది రెండున్నర రోజులకు వస్తుందని చెప్పారు. ఇంధన సరఫరాలో అంతరాయం లేకుండా చూసేందుకు గుత్తి, గుంతకల్లు, వైఎస్సార్ కడపలోని ప్లాంట్ల వద్ద పర్యవేక్షణకు ముగ్గురు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను ఉంచినట్లు వెల్లడించారు. 198 అవుట్‌లెట్ల వద్ద వీఆర్‌ఓ, పోలీసు పర్యవేక్షణ ఉందన్నారు. ఐడీ (ఇండస్టియల్ డీజిల్) కింద ఎవరైనా రిటైల్ అవుట్‌లెట్ల నుంచి తీసుకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధిక పరిమాణంలో పెట్రోల్, డీజిల్ తీసుకున్నవారి జాబితాను తహసీల్దార్లకు ఇచ్చామని, వారు విచారణ చేస్తారని తెలిపారు. ఇంధనం బ్లాక్ మార్కెట్ చేసే వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
● అనంతరం అనంతపురం నగరంలోని పెట్రోల్ బంక్‌లను కలెక్టర్ ఓ.ఆనంద్, ఎస్‌పీ పి.జగదీష్ తనిఖీ చేశారు.


