ఉరవకొండ: రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన ‘హనీట్రాప్’ పాపం కూటమి నేతలదేనని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పార్టీ ఉరవకొండ నియోజకవర్గ పరిశీలకుడు గోవర్దన్‌రెడ్డితో కలిసి ‘విశ్వ’ మాట్లా డారు. హనీట్రాప్ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలు, టీడీపీ ముఖ్య నాయకులు హస్తం ఉండడం సిగ్గుచేటన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్, సవితలు ఇప్పటి వరకు ఈ విషయంపై నోరు మెదపకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు అమాయకులకు అమ్మాయిలను ఎరవేసి వారి నుంచి కోట్లాది రూపాయలు దోచుకున్న వ్యవహారం దేశంలోనే సంచలనంగా మారిందన్నారు. ఈ వ్యవహారంపై గవర్నర్ వెంటనే స్పందించి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
విచ్చలవిడిగా పేకాట కేంద్రాలు..
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత సృష్టించి చంద్రబాబు ప్రభుత్వం వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తోందని ‘విశ్వ’ అన్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఇలాకాలో విచ్చలవిడిగా పేకాట కేంద్రాలు వెలిశాయని, ఇసుక, మట్టిని అక్రమంగా రవాణా చేస్తూ టీడీపీ నేతలు దోపిడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. హనీట్రాప్ వ్యవహారంలో ఉరవకొండ టీడీపీ నేతల పాత్ర కూడా ఉండటం సిగ్గుచేటన్నారు. ప్రతి మంగళవారం అప్పులు చేయనిదే చంద్రబాబు ప్రభుత్వ పాలన ముందుకు సాగని దుస్థితి ఏర్పడడం దారుణమన్నారు. ఇప్పటికే రూ. 3.50 లక్షల కోట్లు అప్పులు చేశారని, నెలకు రూ. 8 వేలకు కోట్లకు పైగా అప్పులు చేస్తున్నారని వివరించారు. రైతులు సాగు చేసిన పంటలను కొనే పరిస్థితి కనిపించడం లేదని, పంట కొనుగోలు చేయడానికి డబ్బులు లేవని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పడంతో రైతాంగం కంగుతినే పరిస్థితి ఏర్పడిందన్నారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న మాట్లాడుతూ ఉరవకొండ నియోజకవర్గంలో గుక్కెడు నీరు అందక ప్రజలు రోడ్లు ఎక్కి నిరసన తెలుపుతున్నా మంత్రి కేశవ్‌కు చీమకుట్టినట్లుగా కూడా లేదన్నారు. అదే మందు కావాలంటే ఏ గ్రామానికి వెళ్లినా ఏరులై పారుతోందని విమర్శించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఈడిగప్రసాద్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, రాష్ట్ర నాయకులు భీమిరెడ్డి, బసవరాజు, కౌడిగిగోవిందు, ఎర్రిస్వామిరెడ్డి, ఓబన్న, డోనేకల్లు కురుబ రమేష్, సోమశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పోలీసు వ్యవస్థను టీడీపీ నేతలు భ్రష్టు పట్టించారు
జిల్లా మంత్రులు నోరు
మెదపకపోవడం సిగ్గుచేటు
పీఏసీ సభ్యుడు విశ్వ ధ్వజం


