● మాజీ మంత్రి శైలజానాథ్ మండిపాటు
శింగనమల (నార్పల): ‘మొన్నటి వరకు రైతులను యూరియా సమస్య వేధించింది. గ్యాస్ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నేడు పెట్రోల్, డీజిల్‌కూ అవస్థలు పడేలా చేశారు. చంద్రబాబు ప్రభుత్వ అసమర్థతతోనే ఇలా జరుగుతోంది’ అంటూ మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపడ్డారు. ఇంధన సరఫరా విషయంలో చంద్రబాబు సర్కారు నిర్లక్ష్య వైఖరిపై మంగళవారం నార్పలలోని పెట్రోల్ బంక్ వద్ద వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీజిల్ దొరక్క పంట నూర్పిడి యంత్రాలు ఆగిపోతున్నాయన్నారు. రైతులు సేద్యం చేసుకోలేకపోతున్నారన్నారు. సామాన్యుడిపై మోయలేని భారం పడుతోందన్నారు. సీఎం చంద్రబాబు మాటలు తప్ప చేతల్లో చూపడం లేదని విమర్శించారు. ఇంధనం కొరత లేదంటూ ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్నా క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొందన్నారు. డీజిల్, పెట్రోలు కోసం ప్రజలు బారులు తీరుతున్నారన్నారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల్లో సులువుగా దొరుకుతున్న డీజిల్, పెట్రోలు ఇక్కడెందుకు దొరకడం లేదని నిలదీశారు. త్వరలో ప్రభుత్వం డీజిల్ ధరను పెద్ద ఎత్తున పెంచుతుందని ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో పంటలను మద్దతు ధరకు కొనేవారు లేక అన్నదాతలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతమన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికై నా ఒట్టి మాటలు చాలించాలన్నారు. ‘ఇది అసమర్థ ప్రభుత్వం.. వెంటనే దిగిపోవాలి’ అని ప్రజలు డిమాండ్ చేస్తున్నారన్నారు. వెంటనే డీజిల్, పెట్రోలు సరఫరా పెంచి ప్రజల అవస్థలు తొలగించకపోతే వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్లు పరంధామ రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, ఎల్లారెడ్డి, ఎంపీపీ నాగేశ్వరావు, జడ్పీటీసీ భాస్కర్, బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు ఫణీంద్ర, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు ఆంజినేయులు, ఇంటెలెక్చువల్ నియోజకవర్గ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌రెడ్డి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు ప్రభుదాస్, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి రామాంజినేయులు, నాయకులు బాలనాగి బయన్న, శంకర్ యాదవ్, వెంకటరామిరెడ్డి, పక్కీరెడ్డి, రంగయ్య, శివశంకర్‌రెడ్డి, నాగరాజు, శివారెడ్డి, ఎంఎస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.


