● అగ్ని గోళంలా అనంత
● రాగల ఐదు రోజులు
మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు
అనంతపురం అగ్రికల్చర్: సూరీడు ఏ మాత్రం తగ్గేదేలే అంటున్నాడు. ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. భానుడి భగభగలకు జిల్లా అగ్ని గోళంలా మారింది. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉక్కపోత, వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాత్రిళ్లు కూడా 25 నుంచి 30 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో అల్లాడిపోతున్నారు. పుట్లూరు, యల్లనూరు మండలాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. సాయంత్రం 5, 6 గంటల సమయంలో కూడా కొన్ని మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణ్రోగతలు నమోదుకావడం గమనార్హం. మధ్యాహ్న సమయంలో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా సుదీర్ఘకాలం వేసవితాపం కొనసాగుతుండటంతో జనం పరిస్థితి ఘోరంగా తయారైంది. తాడిపత్రి, కళ్యాణదుర్గం, యల్లనూరు, పుట్లూరు, విడపనకల్లు, నార్పల, పెద్దపప్పూరు, పెద్దవడుగూరు, గుత్తి, గుంతకల్లు, శింగనమల తదితర మండలాల్లో మరింత దారుణంగా ఉంది. నీడ కోసం జనం వెంపర్లాడుతున్నారు. వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. చిన్నారులు, వృద్ధులు, రైతులు, శ్రామికులు, మహిళలు, వ్యాధిగ్రస్తులు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. మంచినీరు, మజ్జిగ, కొబ్బరినీళ్లు, చెరకు రసం, ఓఆర్‌ఎస్, పండ్ల రసాలు తీసుకోవాలంటున్నారు, గొడుగు, టోపీ, మాస్క్, గ్లౌజులు లాంటివి వాడాలని సూచిస్తున్నారు.
మరింత తీవ్రత..
రాగల ఐదు రోజులు కూడా ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 29 నుంచి మే 3 వ తేదీ మధ్య పగటి ఉష్ణోగ్రతలు 42.7 డిగ్రీల నుంచి 43.2 డిగ్రీలు, రాత్రిళ్లు 28.3 డిగ్రీల నుంచి 28.9 డిగ్రీల మధ్య నమోదు కావచ్చన్నారు. కొన్ని మండలాల్లో 44 డిగ్రీలకు పైగా నమోదయ్యే సూచన ఉన్నట్లు తెలిపారు. అలాగే 29, 30 తేదీల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడవచ్చన్నారు. గాలిలో తేమశాతం ఉదయం 54 నుంచి 56, మధ్యాహ్న సమయంలో 15 నుంచి 25 శాతం మధ్య రికార్డు కావచ్చన్నారు. ఆగ్నేయం దిశగా గాలులు గంటకు 6 కిలోమీటర్ల వేగంతో వీచే సూచన ఉన్నట్లు తెలిపారు.


