ఇంధన సంక్షోభానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే | - | Sakshi
Sakshi News home page

ఇంధన సంక్షోభానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే

Apr 29 2026 7:36 AM | Updated on Apr 29 2026 7:36 AM

అనంతపురం:రాష్ట్రంలో నెలకొన్న ఇంధన సంక్షోభానికి చంద్రబాబు ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డి విమర్శించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్లే ఇంధన కొరత ఏర్పడిందని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం ఏపీలోనే ఇంధన సంక్షోభం నెలకొనడం ఆందోళనకరమన్నారు. సమస్య తీవ్రమవుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. ఇంధన సరఫరాలో ఎలాంటి లోటు లేదని, ఒక్క ఇండెంట్‌ కూడా పెండింగ్‌లో లేదని కేంద్ర ప్రభుత్వ స్థాయిలో సమాచారం ఉన్నప్పటికీ రాష్ట్రంలో కొరత ఏర్పడటం ఏమిటని ప్రశ్నించారు. ధరలు పెరుగుతాయన్న అంచనాలతో డీలర్లు స్టాక్‌ నిల్వ చేసుకుంటున్నారని, ఈ విషయం తెలిసినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. జిల్లా వ్యాప్తంగా చాలా పెట్రోల్‌ బంకుల వద్ద వాహనదారులు గంటల తరబడి క్యూలలో వేచి ఉండాల్సి వస్తోందని, కొన్ని చోట్ల నో స్టాక్‌ బోర్డులు కనిపిస్తున్నాయని తెలిపారు. ప్రజల ఇబ్బందులను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందని విమర్శించారు. కమాండ్‌ కంట్రోల్‌ వ్యవస్థలు ఉన్నాయని చెప్పుకునే ప్రభుత్వం ఇంధన కొరతను గుర్తించలేకపోవడం అసమర్థతకు నిదర్శనమన్నారు. ఇంధన సంక్షోభానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement