అనంతపురం: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మెడికల్ స్టోర్లలో మత్తు కలిగించే మందుల విక్రయాలు ఊపందుకున్నాయి. కొన్ని రకాల మత్తు మాత్రలను అవసరమైన రోగులకు మాత్రమే వైద్యులు సూచిస్తుంటారు. నిబంధనల ప్రకారం ఇలాంటి ఔషధాలను ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయించరాదు. అయితే.. మెడికల్ స్టోర్ నిర్వాహకులు మాత్రం నిబంధనలకు నీళ్లొదిలి అధిక మొత్తం చెల్లిస్తే చాటు ఎన్ని కావాలంటే అన్ని మందు బిల్లలు, సిరప్‌లు అందజేస్తున్నారు. కండలు తిరిగిన దేహంపై మోజుతో జిమ్‌లకు వెళుతున్న కొందరు యువకులు క్లినికల్ ట్రీట్‌మెంట్‌లో ముఖ్యమైన పాత్ర పోషించే అనాబాలిక్–ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్లు వాడుతున్నట్లుగా తెలుస్తోంది. హిందూపురం, కదిరి, అనంతపురం తదితర ప్రాంతాల్లో వీటి వినియోగం ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. వీటిని వినియోగిస్తే గుండెపోటు, మూత్రపిండాల వ్యాధులు, లివర్ సమస్యలు వస్తాయి. యువతలో వంధ్యత్వ సమస్యలకు కూడా ఇవి కారణమవుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి
షెడ్యూల్ హెచ్–1 పరిధిలో ఉన్న నైట్రోవిట్, ఆల్ఫ్రాజోలం, ట్రెమడాల్ వంటి కొన్ని రకాల ట్యాబ్లెట్లను డాక్టర్లు నొప్పి నివారణకు, మరికొన్నింటిని మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారికి నిద్ర వచ్చేలా సూచిస్తుంటారు. వీటిని డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌తో మాత్రమే మెడికల్ దుకాణాల్లో విక్రయించాలి. ఇందు కోసం ప్రత్యేక రిజిస్టర్ నిర్వహించాలి. కొనుగోలుదారు వివరాలను అందులో పొందుపరచాలి. కానీ, మెడికల్ స్టోర్ నిర్వాహకులు మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతూ అధిక ధరలకు వాటిని విక్రయించి యువతను పెడదోవ పట్టిస్తున్నారు. సైకోట్రోపిక్ సబ్‌స్టెన్స్ (మాదకద్రవ్యం)గా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ట్రెమడాల్ వంటి ప్రమాదకరమైన మాత్రలను సైతం ఉమ్మడి జిల్లాలోని కొన్ని మెడికల్ స్టోర్లలో గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. ఐసిస్ డ్రగ్‌గా పేరొందిన ట్రెమడాల్‌ను డిమాండ్‌ను బట్టి ఒక్కో షీట్‌పై రూ. 200 నుంచి రూ.300 అధిక ధరకు విక్రయిస్తున్నట్లుగా తెలుస్తోంది. కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల నుంచి వీటిని తెప్పించుకుంటున్న విక్రయదారులు హిందూపురం మీదుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అత్యంత గోప్యంగా సరఫరా చేస్తున్నట్లు సమాచారం.
అతీగతీ లేని ఆడిట్
వాస్తవానికి షెడ్యూల్ హెచ్–1 డ్రగ్స్.. కంపెనీలో తయారీ నుంచి అవి ఏ ఏజెన్సీకి వచ్చాయి? ఏ మెడికల్ షాప్‌నకు వెళ్లాయి? ఏ కస్టమర్‌కు విక్రయించారు? అన్న ప్రతి అంశంపై ఆడిట్ ఉండాలి. కానీ, ఆ నిఘా ఉండడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. శస్త్రచికిత్సల్లో వాడే అనస్థీషియా ఇంజెక్షన్లను కూడా మత్తు జల్సాకు ఉపయోగిస్తున్నట్టు తేలింది. వీటిని బహిరంగ మార్కెట్‌లో అమ్మరు. కేవలం దవాఖానల్లోనే దొరుకుతాయి. ఈ ఇంజెక్షన్లకు సంబంధించి వైద్యులు ప్రిస్క్రిప్షన్ కూడా రాయరు. కానీ, కొంత మంది ఫార్మా డీలర్లే అక్రమంగా బయటికి తీసుకొచ్చి తెలిసిన వారితో విక్రయిస్తు భారీగా సంపాదిస్తున్నారు.
తనిఖీలు చేస్తున్నాం
మెడికల్ స్టోర్లలో మత్తు కలిగించే యాంటీబయాటిక్స్ అమ్మకూడదు. నిబంధనల మేరకే నిర్వాహకులు నడుచుకోవాలి. లేకపోతే సంబంధిత మెడికల్ స్టోర్ల యజమానులపై చర్యలు తప్పవు. మెడికల్ స్టోర్లను తరచుగా తనిఖీలు చేస్తున్నాం.
– వీరకుమార రెడ్డి,
అసిస్టెంట్ డైరెక్టర్, డ్రగ్స్ కంట్రోల్
ఈ ఏడాది ఫిబ్రవరిలో అనంతపురంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో ఉన్న లైఫ్‌కేర్ మెడికల్, జనరల్ స్టోర్స్‌లో మత్తు కలిగించే మందులను బిల్లులు లేకుండా కలిగి ఉన్నట్లుగా తనిఖీ అధికారులు గుర్తించారు. అలాగే కొనుగోలు, అమ్మకం రికార్డులూ సరిగా నిర్వహించలేదు.దీంతో ఇచ్చిన నోటీసులకు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో పాటు రికార్డులనూ చూపించకపోవడంతో ఆ షాపు లైసెన్స్ రద్దు చేశారు.
గత ఏడాది అక్టోబర్‌లో పామిడి గ్రామంలోని బాలాజీ మెడికల్, ఫ్యాన్సీ స్టోర్‌లో భారీ స్థాయిలో మత్తు కలిగించే మెడికల్ మందులు బయటపడ్డాయి. దీంతో తనిఖీ అధికారులు క్రిమినల్ కేసు నమోదు చేసి, ఆ షాపు లైసెన్స్‌ను రద్దు చేశారు.
ఉమ్మడి జిల్లాలో ప్రిస్క్రిప్షన్ లేకుండానే మెడికల్ షాపుల్లో విక్రయాలు
మత్తులో చిత్తవుతున్న యువత
కట్టడి చేయడంలో డ్రగ్స్ నియంత్రణ అధికారులు విఫలం


