అనంతపురం కల్చరల్: వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేటట్లు చిన్నారులను గ్రంథాలయాలలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిక్షణా శిబిరాల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని కేంద్ర గ్రంథాలయ కార్యదర్శి కమ్మన్న పిలుపునిచ్చారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో మంగళవారం విద్యా, వైజ్ఞానిక వేసవి శిక్షణా శిబిరాన్ని ఆయన ప్రారంభించి, మాట్లాడారు. ఈసారి వేసవి మరింత తీవ్రంగా ఉండడంతో పిల్లలు ఎండల్లో కాకుండా నీడపట్టున అన్ని రకాల కళలు నేర్చుకునేందుకు గ్రంథాలయాలు తోడ్పాటునందిస్తాయన్నారు. ఆటపాటల్లో ఉచిత శిక్షణతో పాటూ నిత్యం స్నాక్స్ అందిస్తామన్నారు. గ్రంథాలయాల విశిష్టతను శిక్షకులుగా వ్యవహరిస్తున్న కవులు శ్రీరాములు, అంకె రామలింగమయ్య, యోగా మాస్టర్ వెంకటేష్, డ్రాయింగ్ మాస్టర్ వినోద్‌కుమార్ వివరించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది గోవిందు, ముత్యాలమ్మ, ఇందిరమ్మ, శిరీషకుమారి, నాగరాజు, నాగభూషణ పాల్గొన్నారు.
ఏడీఏ నారాయణనాయక్‌కు డీడీఏగా పదోన్నతి
అనంతపురం అగ్రికల్చర్: ఆత్మ ఇన్‌చార్జ్‌గా పనిచేస్తున్న వ్యవసాయశాఖ కణేకల్లు ఫారం ఏడీఏ నారాయణనాయక్‌కు డిప్యూటీ డైరెక్టర్ (డీడీఏ)గా పదోన్నతి కల్పించారు. శ్రీసత్యసాయి జిల్లా జేడీఏ కార్యాలయంలో ఖాళీగా ఉన్న డీడీఏ స్థానానికి ఆయనను బదిలీ చేశారు. అలాగే వైఎస్సార్ కడప జిల్లాలో ఏడీఏగా ఉన్న మురళీధర్‌రెడ్డికి డీడీఏగా పదోన్నతి కల్పించి అనంతపురం జేడీఏ కార్యాలయ డీడీఏగా బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. కాగా, మురళీధర్‌రెడ్డి వచ్చే మే నెలాఖరున, నారాయణనాయక్ వచ్చే జూన్ నెలాఖరున ఉద్యోగ విరమణ చేయనున్నట్లు ఆ శాఖ వర్గాలు వెల్లడించాయి.
‘పనస’కు రాయితీలు
కల్పించాలి
● ఉద్యానశాఖ ఏడీకి రైతుల వినతి
అనంతపురం అగ్రికల్చర్: పనస తోటలు సాగు చేసిన జిల్లాలోని రైతులకు ఉద్యానశాఖ తరపున రాయితీలు వర్తింపజేయాలని పలువురు రైతులు కోరారు. ఈ మేరకు స్థానిక ఉద్యానశాఖ కార్యాలయంలో ఏడీ దేవానందకుమార్‌ను రాయదుర్గం, బొమ్మనహాల్, అనంతపురం, ఉరవకొండ మండలాలకు చెందిన రైతులు పాటిల్ అనంతరెడ్డి, ఆదినారాయణరెడ్డి, సి.రామకృష్ణారెడ్డి, లోకానంద్, బసపప్ప, రామస్వామినాయుడు, రామనాథరెడ్డి తదితరులు మంగళవారం కలిసి విన్నవించారు. కొందరు ఇప్పటికే పసన సాగు చేయగా, మరికొందరు సాగు చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం తరపున రాయితీలు వర్తింపజేస్తే కొంత వెసులుబాటు ఉంటుందని పేర్కొన్నారు. దీనిపై ఏడీ మాట్లాడుతూ.. పనసకు రాయితీ అంశాన్ని ఉద్యానశాఖ డీడీ, అలాగే కమిషనరేట్ అధికారుల దృష్టికి తీసుకెళతానని తెలిపారు. అలాగే డ్రైలాండ్ హార్టికల్చర్, ఉపాధి హామీ పథకం కింద చేర్చే అవకాశం ఉన్నందున డ్వామా అధికారులనూ కలవాలని సూచించారు.
విద్యను వ్యాపారంగా
మారుస్తున్న ప్రభుత్వం
● ఆలిండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ మండిపాటు
అనంతపురం ఎడ్యుకేషన్: ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ యూనివర్సిటీ అభివృద్ధికి ప్రభుత్వం రూ.500 కోట్లు ఇస్తుందని, మరో రూ. 500 కోట్లు పెట్టుబడుదారులు సమకూర్చాలని చెప్పడాన్ని ఆలిండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ (ఏఐఎస్‌ఈసీ) తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఏఐఎస్‌ఈసీ రాష్ట్ర అధ్యక్షుడు కె.వేణుగోపాల్‌రెడ్డి, కార్యదర్శి మాసూల సుబ్రమణ్యం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యా వ్యవస్థకు అవసరమైన నిధులు ప్రభుత్వం సమకూర్చితేనే విద్యావ్యవస్థ సామాజిక ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుందన్నారు. అలాకాకుండా కార్పొరేట్ కంపెనీల నుంచి నిధులు అడిగితే పబ్లిక్ ఫండింగ్ విద్యలో కూడా వ్యాపారానికి తలుపులు తెరిచినట్లేనని మండిపడ్డారు. లాభాపేక్ష లేకుండా పెట్టుబడుదారులు ఎందుకు ముందుకు వస్తారని ప్రశ్నించారు. వారినుంచి నిధులు ఆశించడం అంటే ఏదో ఒకరూపంలో యూనివర్సిటీ ఆస్తులను వారి చేతుల్లో పెట్టడమేనన్నారు. ఇలాంటి చర్యలు ఇప్పటికే ప్రభుత్వం రంగంలో ఉన్న యూనివర్సిటీలు, డిగ్రీ, జనియర్ కళాశాలలు, పాఠశాలల ఆస్తులను ప్రైవేట్ వ్యవక్తుల చేతుల్లో పెట్టడానికి మార్గం సుగమమవుతుందన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని ఆంధ్ర యూనివర్సిటీకి రూ. వెయ్యికోట్లు తానే సమకూర్చాలన్నారు. విద్యా వ్యవస్థలో పీపీపీ విధానాన్ని అమలు చేయొద్దని డిమాండ్ చేశారు.


