సందర్భం
అనంతపురం కల్చరల్: శాసీ్త్రయ, జానపద, వెస్ట్రన్ నృత్యరూపమేదైనా ఆహూతులను మంత్రముగ్దులను చేసే కళ అనంతవాసుల సొంతం కావడం విశేషం. జిల్లాకు చెందిన ఎందరో కళాకారులు శాసీ్త్రయ నృత్యవైభవాన్ని ఖండాంతరాలకు పరిచయం చేశారు. భారతీ య సంప్రదాయ నృత్యకళ విశిష్టతను చాటుతూ ఏటా ఏప్రిల్ 29న ‘అంతర్జాతీయ నృత్య దినోత్సవం’ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం అనంతపురంలో సాగనున్న ప్రత్యేక నాట్య ప్రదర్శనలు అనంత వాసులను అలరించనున్నాయి.
అసలైన నాట్య‘వరద’
జిల్లాలో శాసీ్త్రయ నృత్యానికి పునాదులేసిన వరదరాజ అయ్యంగార్ అనంతరం అప్పారావు, కృష్ణకుమార్ వంటి మాస్టర్లు తొలిరోజుల్లో అనంతలో అద్భుతమైన కళాకారులను తీర్చిదిద్దారు. అనంతర కాలంలో ప్రముఖ నాట్యాచార్యులుగా రాణిస్తున్న సంధ్యామూర్తి.. నృత్య కళానిలయం స్థాపించి అనంత ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపజేశారు. అలాగే నాట్య విద్వాంసుడు పట్నం శివప్రసాద్ చిరుప్రాయం నుంచి జాతీయ స్థాయిలో అన్ని ప్రధాన వేదికలపై జిల్లా ఖ్యాతిని ఘనంగా చాటిచెప్పారు. ఆయన శిష్యురాలు నాగలక్ష్మి తానా సభల్లో కూచిపూడి ప్రదర్శనతో మెప్పించడమే కాక ప్రస్తుతం విదేశాల్లో స్థిరపడి అక్కడి వారికి శాసీ్త్రయ నృత్య శిక్షణ ఇస్తోంది. అలాగే కృష్ణమూర్తిరాజు, విజయ్‌కుమార్, సురేష్ మాస్టర్, పద్మావతి వంటి శాసీ్త్రయ నాట్యకళాకారులతో పాటూ అరుదైన ‘పేరిణి శివతాండవం, ఆంఽధ్రనాట్యం’ను నారాయణస్వామి జిల్లా వాసులకు పరిచయం చేశారు. వెస్ట్రన్, ఫోక్ స్టైల్‌లో రాణిస్తున్న కత్తి విజయ్‌కుమార్, మక్బుల్‌బాషా, విష్ణు, వన్నూరు, హరిప్రసాద్ వంటి వారు అధునాతన నాట్యాలకు ప్రత్యేక గుర్తింపు తెస్తున్నారు.
ఎల్కేపీ వేదికగా నాట్య దినోత్సవం
శ్రీగురుకృప సంగీత నృత్యకళానికేతన్ ఆధ్వర్యంలో ప్రముఖ నాట్యాచార్యులు పట్నం శివప్రసాద్ నేతృత్వంలో ఆయన శిష్య బృందాలు బుధవారం అనంతపురంలోని లలితకళాపరిషత్తు వేదికగా శాసీ్త్రయ నృత్య రూపకాలతో నటరాజుకు నీరాజనాలర్పించనున్నారు. బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి సాగే నృత్య వేడుకల్లో కళాభిమానులు పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.
నృత్య రూపకాన్ని ప్రదర్శిస్తున్న పట్నం శివప్రసాద్ శిష్యబృందం (ఫైల్), విదేశాల్లో ప్రదర్శన ఇస్తున్న సంధ్యామూర్తి శిష్య బృందం (ఫైల్)
నేడు అంతర్జాతీయ
నృత్యదినోత్సవం


