విడపనకల్లు: పిడుగుపాటుకు గొర్రెలు మృతిచెందాయి. స్థానికులు తెలిపిన మేరకు... విడపనకల్లు గ్రామానికి చెందిన కురుబ అనిల్‌కుమార్ జీవాల పోషణతో జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం తన జీవాలను కర్ణాటక సరిహద్దులోని ఏపీ మోడల్ స్కూల్ వద్దకు మేపునకు తోలుకెళ్లాడు. సాయంత్రం ఒక్కసారిగా ఉరములు, మెరుపులతో వాతావరణంలో మార్పు చోటు చేసుకోవడంతో సమీపంలోని చెట్టుకిందకు గొర్రెలను కాపరులు చేర్చారు. ఆ సమయంలో పిడుగు పాటుకు 26 గొర్రెలు మృతి చెందాయి. కాపరి కురుబ మల్లికార్జునకు గాయాలయ్యాయి. ఘటనతో రూ.4 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధిత కాపరి వాపోయాడు.
కుక్కల దాడిలో 40 పొట్లేళ్లు మృతి
గార్లదిన్నె: కుక్కల దాడిలో 40 పొట్టేళ్లు మృతి చెందిన ఘటన మంగళవారం గార్లదిన్నె మండలం మర్తాడులో చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన చిన్న నారాయణ పొట్టేళ్ల పెంపకంతో జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం తనకున్న 60 పొట్టేళ్లను షెడ్డులో వదిలి భోజనానికి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో కుక్కల గుంపు షెడ్డులోకి చొరబడి పొట్టేళ్లపై దాడి చేశాయి. కుటుంబసభ్యులు గమనించి కేకలు వేస్తూ కుక్కలను తరిమేశారు. అప్పటికే 40 పొట్టేళ్లు మృతి చెందాయి. మరికొన్ని తీవ్రంగా గాయపడ్డాయి. సమాచారం అందుకున్న తరిమెల పశువైద్యాధికారి డాక్టర్ మౌనుప్రియ అక్కడకు చేరుకుని గాయపడిన గొర్రెలు చికిత్స అందించారు. ఘటనతో రూ.3 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
గుత్తి రూరల్: మండలంలోని బేతాపల్లికి చెందిన శ్రీనివాసులు (45) విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. ఆయనకు భార్య, పిల్లలు ఉన్నారు. మంగళవారం తన ఇంటి వద్ద నిచ్చెన పైకి ఎక్కి విద్యుత్ మరమ్మతు పనులు ముగించుకుని కిందకు దిగుతున్న సమయంలో పక్కనే ఉన్న తీగలు తగిలి షాక్‌కు గురై కిందపడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా, చికిత్స మొదలు పెట్టేలోపు మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


