అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయశాఖలో విచారణల పర్వం కొనసాగుతోంది. ఇటీవల ఆ శాఖ అధికారుల మధ్య నెలకొన్న విభేదాలు ముదిరిపాకాన పడడంతో పరస్పర ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో రాజకీయ నాయకులు కూడా ఫిర్యాదులు సమర్పించారు. దీంతో గత నెల రోజులుగా రకరకాల విచారణలు కొనసాగుతున్నాయి. తాజాగా కమిషనరేట్ నుంచి వచ్చిన జేడీఏ స్థాయి విచారణాధికారి విజయభారతి మంగళవారం స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో విచారణ చేపట్టారు. ప్రధానంగా అనంతపురం ఏడీఏగా పనిచేసిన ఎం.రవిపై స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ గతేడాది జూన్‌లో మంత్రి అచ్చెన్నాయుడుకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఇన్‌చార్జి జేడీఏగా పనిచేస్తున్న రవిపై పలు ఆరోపణలు చేశారు. అయితే తాజాగా ఎమ్మెల్యే దగ్గుపాటి తన ఫిర్యాదును వెనక్కు తీసుకుని.. గతంలో తాను చేసిన అరోపణల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదని విచారణాధికారికి లేఖ కూడా రాశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఇచ్చిన రెండు ఫిర్యాదులపై మంగళవారం విచారణ చేపట్టారు. అప్పట్లో అనంతపురం డివిజన్ పరిధిలో పనిచేసిన ఆరు మండలాల ఏఓలు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్టినేట్లు, ప్రస్తుతం తాడిపత్రి ఏడీఏ ఇన్‌చార్జ్ జేడీఏగా ఉన్నందున తాడిపత్రి కార్యాలయ స్టాఫ్‌ను పిలిపించారు. అలాగే 20 మంది వరకు ఇన్‌పుట్ డీలర్లు విచారణాధికారి ఎదుట హాజరయ్యారు. చివరగా జేడీఏ రవి కూడా హాజరయ్యారు. అందరి నుంచి లిఖిత పూర్వక వాంగ్మూలం తీసుకున్నట్లు విచారణాధికారి తెలిపారు. సమగ్ర నివేదికను కమిషనరేట్‌కు అందించనున్నట్లు పేర్కొన్నారు.


