పోలీస్‌ స్టేషన్‌లోనే రెచ్చిపోయిన ‘పచ్చ’ మూక | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ స్టేషన్‌లోనే రెచ్చిపోయిన ‘పచ్చ’ మూక

Apr 28 2026 7:35 AM | Updated on Apr 28 2026 7:35 AM

పోలీసులను పక్కకు నెట్టి వైఎస్సార్‌సీపీ నేతపై దాడి

తాడిపత్రి రూరల్‌: ప్రజలకు రక్షణ దక్కుతుందనుకున్న పోలీస్‌ స్టేషన్‌లోనే ‘పచ్చ’ మూక రెచ్చిపోయింది. నాలుగు గోడల మధ్య పోలీసులను పక్కకు నెట్టేస్తూ వైఎస్సార్‌సీపీ నేత ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని చుట్టుముట్టి విచక్షణారహితంగా దాడికి తెగబడింది. ఇందుకు తాడిపత్రిలోని అప్‌గ్రేడ్‌ పీఎస్‌ వేదికై ంది. బాధితుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తెలిపిన మేరకు... మండలంలోని ఆలూరు గ్రామానికి చెందిన ఆనంద్‌ పెద్దలను ఎదిరించి అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయంగా ఇరువైపులా తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి ప్రేమ జంటను అదుపులోకి తీసుకుని తాడిపత్రి యూజీ పీఎస్‌కు పిలుచుకువచ్చారు. విషయం తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి సోమవారం ఉదయం పోలీసుస్టేషన్‌లోని తన స్నేహితుడు అనంద్‌ను కలిసి మాట్లాడేందుకు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న టీడీపీ నాయకులు తిరుపాల్‌రెడ్డి, రవి, ఆంజనేయరెడ్డి, ప్రవీణ్‌, సుబ్బరాయుడు తదితరులు ప్రవీణ్‌కుమార్‌ రెడ్డిని చూడగానే చంపండిరా అంటూ విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. అడ్డుకోబోయిన పోలీసులను పక్కకు నెట్టేశారు. అతి కష్టంపై ప్రాణాలు దక్కించుకుని బయటపడిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డి విషయాన్ని వెంటనే గ్రామంలోని వైఎస్సార్‌సీపీ నాయకులకు తెలిపి వారిని అప్రమత్తం చేశాడు. అనంతరం మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి ఫోన్‌ ద్వారా వివరించారు. పెద్దారెడ్డి సూచన మేరకు అనంతపురానికి వెళ్లి ఎస్పీ జగదీష్‌ను కలిసి తనకు టీడీపీ నాయకుల నుంచి ప్రాణహాని ఉందని, తనను రక్షించాలంటూ వినతి పత్రం అందజేశాడు. అనంతరం తాడిపత్రిలో ఏఎస్పీ రోహిత్‌ కుమార్‌ను కలిసి దాడికి కారణమైన టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరాడు.

అసిస్టెంట్‌ కలెక్టర్‌

బాధ్యతల స్వీకరణ

అనంతపురం అర్బన్‌: అసిస్టెంట్‌ కలెక్టర్‌గా సుయాష్‌ కుమార్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆయన కలెక్టర్‌ ఆనంద్‌ వద్ద రిపోర్టు చేసుకున్నారు. కలెక్టర్‌కు పూల మొక్క అందజేశారు. అనంతరం జాయింట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌ను కలిశారు. ఏడాది పాటు జిల్లాలో శిక్షణ పొందుతారు. 2025 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన సుయాష్‌ కుమార్‌ది ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం. ఆయన బెనారస్‌ హిందూ యూనివర్సిటీ (వారణాసి)లో ఐఐటీ, ముస్సోరీలోని లాల్‌ బహదూర్‌ శాస్త్రి నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌లో ఫేస్‌–1 శిక్షణ పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం ఏడాది పాటు జిల్లాలో వివిధ శాఖల్లో శిక్షణ తీసుకుంటారు.

బీజేపీ నుంచి ‘హనీ ట్రాప్‌’ మహిళల తొలగింపు

అనంతపురం టవర్‌క్లాక్‌: హనీట్రాప్‌ వ్యవహారంలో అరెస్టయిన ముఠా సభ్యులు చంద్రకళ రాయల్‌, మల్లీశ్వరి, అనంత కుమారిలను బీజేపీ నుంచి తొలగిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇక నుంచి వారికి బీజేపీతో ఎటువంటి సంబంధమూ లేదని స్పష్టం చేశారు. హనీట్రాప్‌ ముఠాతో ఎవరికి సంబంధమున్నా పార్టీ ఉపేక్షించబోదని, కఠినంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement