పోలీసుల వైఫల్యంతోనే హత్యలు | - | Sakshi
Sakshi News home page

పోలీసుల వైఫల్యంతోనే హత్యలు

Apr 28 2026 7:35 AM | Updated on Apr 28 2026 7:35 AM

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి

తాడిపత్రిటౌన్‌: తాడిపత్రిలో జరిగిన హత్యలకు పోలీసుల వైఫల్యమే కారణమని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. పోలీస్‌ అధికారులు మట్కా, గ్యాంబ్లింగ్‌ మామూళ్ల మత్తులో పడి శాంతిభద్రతలను గాలికొదిలేశారని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్త అబ్దుల్‌ హత్య విషయం తెలుసుకున్న ఆయన ఆదివారం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి విలేకరులతో మాట్లాడారు. తాడిపత్రిలో పోలీసులకు చట్టంతో పని లేదని, డబ్బులు సంపాదించుకుంటే రేపు ఉద్యోగం ఉన్నా లేకపోయినా ఫర్వాలేదు.. వ్యాపారాలు చేసుకోవచ్చనే ధీమాతో ఉన్నారన్నారు. ఓ పోలీస్‌ అధికారే మహిళలను ఈవ్‌టీజింగ్‌ చేస్తున్నారన్నారు. ఈ విషయంలో ఎస్పీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. పోలీసులు సివిల్‌ పంచాయితీలు చేస్తూ.. మాట వినని వారిపై గంజాయి కేసులు నమోదు చేస్తామంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. సామాన్యులు న్యాయం కోసం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లే పరిస్థితి లేదన్నారు. టీడీపీ నాయకులు నేరాలకు పాల్పడినా గంటలోపే స్టేషన్‌ బెయిల్‌ ఇస్తున్నారని, అదే వైఎస్సార్‌సీపీ కార్యకర్త యాక్టివ్‌గా ఉంటే చాలు అక్రమ కేసులు నమోదు చేస్తూ జైలుకు పంపుతున్నారని విమర్శించారు. పోలీసులు పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని హితవు పలికారు.

Advertisement
 
Advertisement
Advertisement