పెట్రోల్‌పై ఆందోళన వద్దు | - | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌పై ఆందోళన వద్దు

Apr 28 2026 7:35 AM | Updated on Apr 28 2026 7:35 AM

అనంతపురం అర్బన్‌: జిల్లాలో ఇంధన (డీజిల్‌–పెట్రోల్‌) కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్టర్‌ ఆనంద్‌ స్పష్టం చేశారు. ఇంధన కొరత అంశంపై కలెక్టర్‌ సోమవారం కలెక్టరేట్‌ మినీ కాన్ఫరెన్స్‌ హాలులో జాయింట్‌ కలెక్టర్‌ సి.విష్ణుచరణ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో తగినంత పెట్రోల్‌, డీజిల్‌ నిల్వలు ఉన్నాయని తెలిపారు. స్టాక్‌ ఉండదనే ఆందోళనతో వాహనదారులు అవసరానికి మించి కొనుగోలు చేసి నిల్వ చేసుకోవద్దని సూచించారు. జిల్లాలోని 204 అవుట్‌లెట్లలో 16 చోట్ల మాత్రమే స్టాక్‌ లేదన్నారు. వాటికి త్వరలోనే స్టాక్‌ వస్తుందన్నారు. మిగిలిన వాటిలో యథావిధిగా ఇంధనం పంపిణీ జరుగుతోందన్నారు. బంక్‌ల వద్ద పర్యవేక్షణకు ప్రత్యేకంగా రెవెన్యూ, పోలీసు అధికారులను నియమించామన్నారు. కొందరు బల్క్‌గా పెట్రోల్‌, డీజిల్‌ను నేరుగా కంపెనీల నుంచి కాకుండా రిటైల్‌ అవుట్‌లెట్ల నుంచి డ్రమ్ములు, బ్యారెళ్లలో కొనుగోలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. వారి వివరాలు రిజిష్టర్‌లో నమోదు చేయాలని బంక్‌ యజమానులను ఆదేశించామన్నారు.

కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌

ఇంధన సమస్యలపై వినియోగదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామన్నారు. 85002 92992, 08554–220009, 234122, 239822, 1800 425 8804 నంబర్లకు ఫోన్‌ చేసి సంప్రదించాలన్నారు.

పెట్రోల్‌ బంక్‌ల తనిఖీ

కలెక్టర్‌ ఆనంద్‌, జాయింట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌ సోమవారం నగరంలోని పలు పెట్రోల్‌ బంక్‌లను వేరువేరుగా తనిఖీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement