అనంతపురం అగ్రికల్చర్: తాము ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలంటూ విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల డీలర్లు సోమవారం తలపెట్టిన బంద్ విజయవంతమైంది. ఎరువుల కంపెనీలు నేరుగా దుకాణాలకు సరుకు రవాణా చేయాలని, మార్జిన్ 8 శాతం పెంచాలనే ప్రధాన డిమాండ్లతో దుకాణాల బంద్‌కు పిలుపునిచ్చినట్లు అసోసియేషన్ నాయకులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా దుకాణాలకు పూర్తిగా మూతేయడంతో అక్కడక్కడ రైతులు ఇబ్బందులు పడ్డారు.
ఎమ్మెల్యే అమిలినేని
అనుచరులపై కేసు నమోదు
కళ్యాణదుర్గం: స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనుచరులపై అన్నమయ్య జిల్లా వాయల్పాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇటీవల అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం గండబోయనపల్లి టోల్‌ప్లాజా సిబ్బందిపై అమిలినేని అనుచరులు దాడి చేసిన విషయం తెలిసిందే. విధుల్లో ఉన్న మేనేజర్ రవి, మహిళా సిబ్బంది శ్రీలతపై దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు తీవ్రంగా పరిగణించారు. ఈ క్రమంలో టోల్‌ప్లాజా మేనేజర్ రవి ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం.
రైల్వే విశ్రాంత ఉద్యోగి ఆత్మహత్య
గుత్తి: మండలంలోని ఎస్‌ఎస్ పల్లికి చెందిన రైల్వే విశ్రాంత ఉద్యోగి చంద్రగిరి సింగరయ్య(66) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. అనారోగ్య కారణాలతో మనస్తాపం చెందిన ఆయన సోమవారం స్థానిక ఫోర్ట్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించి కేసు నమోదు చేశారు.
శతాధిక వృద్ధురాలి మృతి
కళ్యాణదుర్గం (కంబదూరు): కంబదూరు మండలం వెంకటాంపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు లోక్‌నాథరెడ్డి తల్లి, శతాధిక వృద్ధురాలు గోవిందమ్మ (106) సోమవారం కన్నుమూశారు. కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతుండేవారు. విషయం తెలుసుకున్న కంబదూరు రూరల్ మండల వైఎస్సార్‌సీపీ కన్వీనర్ కదిరిదేవరపల్లి హనుమంతరాయుడు, వైస్ ఎంపీపీ తిమ్మారెడ్డి, ఐపార్శపల్లి రాఘవేంద్ర, పాళ్లూరు పంచాయతీ రైతు విభాగం అధ్యక్షుడు ప్రతాపరెడ్డితో పాటు పలువురు వెంకటాంపల్లికి చేరుకుని మృతురాకి ఘననివాళులర్పించారు.
● కూల్‌కూల్ ప్రయాణం
ఆత్మకూరు: మండుతున్న ఎండలకు బస్సు ప్రయాణమంటే చాలా మంది భయపడుతున్నారు. అయినా తప్పని పరిస్థితుల్లో ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో వాటర్ బాటిల్ మరిచిపోతే వారి పరిస్థితి వర్ణణాతీతం. ఇలాంటి పరిస్థితుల్లో రాయదుర్గం నుంచి అనంతపురం వెళ్లే ఆర్టీసీ లగ్జరీ బస్సుడ్రైవర్, కండెక్టర్ మంచి ఆలోచన చేశారు. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా కూల్ వాటర్ క్యాన్‌ను స్వయంగా కొనుగోలు చేసి, బస్సులో ఏర్పాటు చేశారు. అందులో నీరు అయిపోయిన వెంటనే తిరిగి సొంత డబ్బుతో కూల్ వాటర్‌తో నింపుతున్నారు. రోజూ రెండు క్యాన్ల నీరు అయిపోతుందని ఈ సందర్భంగా కండెక్టర్ తెలిపారు.
సైన్స్ సెంటర్‌లో
వేసవి శిక్షణ శిబిరం
అనంతపురం ఎడ్యుకేషన్: వేసవి సెలవుల్లో జిల్లా కేంద్రంలోని సైన్స్ సెంటర్‌ను విద్యార్థులు సందర్శించేలా చొరవ తీసుకుని విజ్ఞాన శాస్త్రం పట్ల ఆసక్తి పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జ్ డీఈఓ శ్రీనివాసరావు, సైన్స్ సెంటర్ అధికారి బాలమురళీకృష్ణ కోరారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులకు సైన్స్‌పట్ల అవగాహన పెంచేందుకు, పిల్లల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని ఏర్పరిచేందుకు, ఆలోచన శక్తి, విశ్లేషణాత్మక శక్తి అభివృద్ధి పరిచేలా సైన్స్‌సెంటర్‌లో మే 1 నుంచి 15 వరకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. విద్యాశాఖ, సమగ్రశిక్ష, ఆగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సంయుక్తంగా 6 నుంచి 10వ తరగతుల విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారన్నారు. ప్రయోగాలు, హ్యాండ్ ఆన్ ఎక్స్‌పీరియనపై శిక్షణ ఉంటుందని, మరిన్ని వివరాలకు సైన్స్ సెంటర్ అధికారి బాలమురళీకృష్ణ (89859 34531)ను సంప్రదించాలన్నారు.


