అనంతపురం: ‘బీసీ గళం’ కార్యక్రమం ఘన విజయం సాధించడంతో టీడీపీ వెన్నులో వణుకు పుట్టిందని వైఎస్సార్‌సీపీ బీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్‌గౌడ్ అన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారీ సంఖ్యలో బీసీ నాయకులు తరలివచ్చి విజయవంతం చేసినందుకు, కార్యక్రమానికి హాజరు కావడంతో పాటు అన్ని విధాలుగా సహకారం అందజేసిన ఉమ్మడి జిల్లా నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాలకు తిరుగుబాటుగా బీసీలు పెద్ద సంఖ్యలో హాజరై గళం వినిపించారన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో వణుకు పుట్టిన ఎంపీలు అంబికా లక్ష్మీనారాయణ, బి.కె.పార్థసారథి, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, ఆర్టీసీ జోనల్ చైర్మన్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు పూల నాగరాజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి హేళన చేస్తూ మాట్లాడడం సిగ్గుచేటన్నారు. తక్షణమే బీసీలకు వారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారం చేపట్టి రెండేళ్లు గడుస్తున్నా టీడీపీలో బీసీల పక్షాన వీరు ఏనాడూ మాట్లాడిన పాపాన పోలేదన్నారు. రెడ్‌బుక్ పేరుతో రాష్ట్రంలో బీసీలపై దాడులకు తెగబడుతున్నా.. కనీసం పల్లెత్తు మాట మాట్లాడకుండా ఎందుకు మౌనం పాటిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. బీసీ గళం విజయవంతం కావడంతో కంటి మీద కునుకు దూరమై బీసీలను మభ్య పెట్టే కుట్రలకు తెరలేపారని మండిపడ్డారు. బీసీల న్యాయమైన డిమాండ్లను ఒక్కసారైనా పార్లమెంట్‌లో వినిపించలేని అసమర్థులు ఎంపీలుగా ఉన్నారని విమర్శించారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు కనీసం జ్యోతిరావు పూలే అనే పేరు పలకడం కూడా రాదన్నారు. పార్టీ ఎస్‌ఈసీ సభ్యుడు మీసాల రంగన్న మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలోని కూటమి పార్టీల నాయకుల్లో బీసీలు పెద్ద సంఖ్యలో ఉన్నా... ఏ ఒక్కరైనా బీసీల గురించి మాట్లాడలేకపోతున్నారని మండిపడ్డారు. సీనియర్ నేత కేవీ రమణ మాట్లాడుతూ.. బీసీలకు అండగా నిలిచిన ఏకై క నాయకుడు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డినే అన్నారు. సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు రిలాక్స్ నాగరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న దాడులకు నిరసనగా ఏర్పాటు చేసిన బీసీ గళం విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ ఈ తరహా కార్యక్రమాన్ని ఏ నాయకుడూ నిర్వహించలేదన్నారు. బీసీ సెల్ నగర అధ్యక్షుడు బోయ లక్ష్మన్న మాట్లాడుతూ.. జిల్లాలో బీసీలపై దాడులు జరుగుతున్న స్పందించని టీడీపీ నాయకులకు బీసీ గళం కార్యక్రమం విజయవంతమై వెన్నులో వణుకు పుట్టించిందన్నారు. కార్యక్రమంలో బీసీ నాయకులు బెస్త వెంకటేష్, అంకె తేజ, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్‌గౌడ్


