బొమ్మనహాళ్: మండలంలోని నేమకల్లు శివారున వ్యవసాయ బోరు బావుల మోటార్లకు అనుసంధానం చేసిన కేబుల్‌ను దుండగులు అపహరించారు. ఒక్క రాత్రిలోనే ఏకంగా 40 మంది రైతుల పొలాల్లోని కేబుల్‌ను అపహరించుకెళ్లడం సంచనలం రేకెత్తిస్తోంది. సోమవారం ఉదయం పొలాలకు వెళ్లిన రైతులు విషయాన్ని గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఒక్కో మోటర్ వద్ద సుమారు 30 మీటర్ల మేర కేబుల్‌ను ఎత్తుకెళ్లినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ లెక్కన దాదాపు రూ. 3 లక్షల విలువైన కేబుల్‌ను అపహరించుకెళ్లినట్లుగా రైతులు వాపోయారు. గతంలోనూ ఇలానే కత్తిరించారని, ఎవరికి వారు మళ్లీ కేబులు తెచ్చుకుని ఏర్పాటు చేసుకున్నామని వివరించారు. ఇప్పుడు ప్రతి మోటార్‌కు రూ. 7,500 ఖర్చు చేసి కేబుల్ వైరు కోనాల్సి వస్తుందని, మళ్లీ ఏ రోజు దొంగలు ఎత్తుకెళ్తారో కూడా తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత రైతులు బోయ రామాంజనేయులు, పరమేష్, బోయ గౌసిద్ద, కురుబ హనుమంతప్ప, దానమ్మ, వన్నూరుస్వామి, కుమ్మది వన్నూరుస్వామి, అంగడి ముత్తు తదితరుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.


