తీవ్రమైన పెట్రోల్‌ కష్టాలు | - | Sakshi
Sakshi News home page

తీవ్రమైన పెట్రోల్‌ కష్టాలు

Apr 27 2026 8:06 AM | Updated on Apr 27 2026 8:06 AM

అనంతపురం అర్బన్‌: జిల్లా వ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తుల కొరత తీవ్రమవుతోంది. డీజిల్‌, పెట్రోల్‌ కొరత లేదు.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అసవరం లేదు అంటూ అధికారులు చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. జిల్లాలోని దాదాపు అన్ని పెట్రోల్‌ బంకుల్లోనూ డీజిల్‌, పెట్రోలు పంపిణీ పూర్తిగా నిలిచిపోయింది. కొన్ని బంకుల్లో మాత్రమే ఇంధనం వేస్తున్నారు. మూడు రోజులుగా డీజిల్‌, పెట్రోల్‌ స్టాక్‌ రాలేదని బంకుల నిర్వాహకులు చెబుతున్నారు.

మూతపడుతున్న బంక్‌లు..

జిల్లావ్యాప్తంగా దాదాపు 186 పెట్రోల్‌ బంక్‌లు ఉన్నాయి. ఇందులో అనంతపురం నగరంలో 22, పట్టణ, మండలాల పరిధిలో 164 బంకులు ఉన్నాయి. ఇక పెట్రోల్‌ వినియోగం రోజువారీగా 2.50 లక్షల లీటర్లు, డీజిల్‌ 3.72 లక్షల లీటర్లుగా ఉంది. అనంతపురంలో ఇప్పటికే దాదాపు 15 బంక్‌లు స్టాకు లేదని మూసివేశారు. మిగిలిన బంకుల్లో ఇంధనం కోసం వాహనాలు బారులుతీరుతున్నాయి.

ధరలు పెరిగే అవకాశం..

డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెరిగే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నందున ఇప్పటి వరకు ధరలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని, ఎన్నికలు పూర్తయిన వెంటనే ధరలు పెరగవచ్చని కొందరు డీలర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ధర పెంచే ఆలోచన కారణంగానే బంకులకు డీజిల్‌, పెట్రోల్‌ను కంపెనీలు సవ్యంగా సరఫరా చేయడం లేదని తెలిసింది. ప్రస్తుతం డీజిల్‌ టీటరు ధర రూ.97.50 ఉంది. పెట్రోల్‌ రూ.109.50 ఉంది. యుద్ధం కారణంగా ప్రస్తుతం క్రూడ్‌ ఆయిల్‌ బ్యారెల్‌ ధర అధికంగా ఉండడంతో డీజిల్‌ లీటర్‌పై ఆయిల్‌ కంపెనీలకు రూ.70 నుంచి రూ.80 వరకు నష్టం వస్తోందని, దీంతో డీజిల్‌ వినియోగం అధికంగా ఉండే సంస్థలు, ఇతర పరిశ్రమలకు లీటరు రూ.170తో సరఫరా చేస్తున్నట్లు పెట్రోల్‌ బంక్‌ డీలర్ల సంఘం నాయకులు చెబుతున్నారు. ఇదే క్రమంలో బంకులకు ఆయిల్‌ కంపెనీలు డీజిల్‌ను సరఫరా చేయడం లేదని తెలిసింది. ఇక పెట్రోల్‌ విషయాని వస్తే లీటరుపై రూ.15 నుంచి రూ.20 వరకు పెంచే సూచనలు కనిపిస్తున్నాయని ఆ వర్గాలు చెబుతున్నాయి.

స్టాకు లేక

మూత పడుతున్న బంకులు

ఉన్నచోట పోటెత్తుతున్న

వాహనదారులు

Advertisement
 
Advertisement
Advertisement