జనగణనలో ప్రజలు భాగస్వాములవ్వాలి | - | Sakshi
Sakshi News home page

జనగణనలో ప్రజలు భాగస్వాములవ్వాలి

Apr 27 2026 8:06 AM | Updated on Apr 27 2026 8:06 AM

అనంతపురం అర్బన్‌: జనగణనలో ప్రజలందరూ స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని ముఖ్య సెన్సస్‌ అధికారి, కలెక్టర్‌ ఆనంద్‌ పిలుపునిచ్చారు. జనగణనపై అవగాహన కోసం సెన్సస్‌ విభాగం ఆధ్వర్యంలో ఆదివారం అనంతపురంలో 5కే రన్‌ నిర్వహించారు. కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఆర్ట్స్‌ కళాశాల వద్ద ప్రారంభమై 5కే రన్‌ క్లాక్‌టవర్‌, కోర్టురోడ్‌, ప్రభుత్వ ఆస్పత్రి, జిల్లా పరిషత్‌, సప్తగిరి సర్కిల్‌, రాజురోడ్‌, శ్రీకంఠం సర్కిల్‌, ఆర్టీసీ బస్టాండ్‌ మీదుగా తిరిగి ఆర్ట్స్‌ కళాశాల వద్దకు చేరుకుంది. కలెక్టర్‌ మాట్లాడుతూ జనగణన ప్రక్రియలో భాగంగా ప్రవేశపెట్టిన స్వీయ గణన (సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌)పై ప్రజలకు అవగాన కల్పించడం కోసమే 5కే రన్‌ ముఖ్య ఉద్దేశమన్నారు. స్వీయగణన అనేది వివరాల నమోదు మాత్రమే కాదన్నారు. అది దేశం విషయంలో మనకున బాధ్యత అన్నారు. జనగణనలో నమోదు చేసుకునే వివరాలను దేశ అభివృద్ధికి, సంక్షేమానికి రచించే ప్రణాళికల కోసం వినియోగిస్తారన్నారు. ఈ విరాలు అంత్యంత గోప్యంగా ఉంటాయన్నారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలకు తావులేదన్నారు. జిల్లాలో 10 లక్షల కుటుంబాలు ఉండగా.. ఇప్పటి వరకు 32 వేల కుటుంబాలు మాత్రమే ఆన్‌లైన్‌ పోర్టల్‌లో తమ వివరాలను నమోదు చేసుకున్నాయన్నారు. స్వీయగణన ఈ నెల 30 వరకు కొనసాగుతుందన్నారు. మిగిలిన వారందరూ ఈ నాలుగు రోజుల వ్యవధిలో స్వీయ గణన ద్వారా వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. స్వీయ గణనలో నమోదు చేసుకున్న తరువాత ఐడీ సంఖ్య వస్తుందన్నారు. వివరాలను సేకరణకు మే–1 తేదీ నుంచి ఆ నెల 30వ తేదీ వరకు ఎన్యుమరేటర్లు ఇంటింటికి వస్తారన్నారు. ఆ సమయంలో ఎన్యుమరేటర్లకు ఐడీ నెంబర్‌ చెబితే సరిపోతుందన్నారు. వివరాలను రీ–వెరిఫై చేసే ప్రక్రియను సమర్థవంతంగానూ త్వరగా పూర్తి చేస్తారన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ మలోల, ఏఎస్పీ ఇలియాజ్‌ బాషా, ఆర్డీఓ కేశవనాయుడు, నగర పాలక సంస్థ కమిషనర్‌ జస్వంత్‌రావు, డీఎస్పీ శ్రీనివాసులు, నీటకంఠారెడ్డి, సీపీఓ అశోక్‌కుమార్‌, ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ పద్మశ్రీ, ఆర్‌ఐఓ వెంకటరమణ, డీఐపీఆర్‌ఓ బాలకొండయ్య, జిల్లా క్రీడాధికారి మంజుల, జిల్లా అధికారులు, తహసీల్దారు, సెన్సస్‌ విభాగం అధికారులు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement