అనంతపురం అర్బన్: కలెక్టరేట్ రెవెన్యూ భవన్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వేసవి తీవ్రత దృష్ట్యా ఉదయం 9 గంటల నుంచే అర్జీలను స్వీకరిస్తారన్నారు. పరిష్కార వేదికలో ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. భూసమస్యలపై అర్జీలను పరిష్కార వేదికలో భాగంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్‌లో అందజేయాలన్నారు. అర్జీ పరిష్కార స్థితిని కాల్‌సెంటర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు.
తాడిపత్రిలో భారీగా
గంజాయి పట్టివేత ?
తాడిపత్రిటౌన్: పట్టణంలోని ఓ లాడ్జ్‌లో ఆదివారం పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నట్లు సమాచారం. దాదాపు 15 కేజీల గంజాయితో పాటు ఒడిశాకు చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. ఒడిశాకు చెందిన వీరు మరో చోటకు వెళ్లే క్రమంలో లాడ్జిలో దిగారా లేక తాడిపత్రి పట్టణానికి సంబంధించిన వారికి వీరితో సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై ‘సాక్షి’ సీఐ ఆరోహణరావును వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విషయాన్ని దాటవేశారు.
నేడు డయల్ యువర్
ఎస్పీడీసీఎల్ సీఎండీ
అనంతపురం టౌన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీఎండీ శివశంకర్ లోతేటి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సమస్యలున్న వినియోగదారులు మొబైల్: 8977716661 నంబర్‌కు ఫోన్ చేసి పిర్యాదు చేయాలన్నారు. ఫోన్ చేసే వినియోగదారులు తమ విద్యుత్ నంబర్‌ను తప్పకుండా తెలియజేయాలని సూచించారు.
జిల్లాలో డయల్ యువర్ ఎస్‌ఈ..
అనంతపురం జిల్లాలో డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమాన్ని ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు విద్యుత్‌శాఖ ఎస్‌ఈ శేషాద్రి శేఖర్ తెలిపారు. విద్యుత్ సమస్యలున్న వినియోగదారులు ఫోన్ నంబర్లు 08554–272943, 9154790350కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు.


