రారండోయ్‌ వేడుక చూద్దాం | - | Sakshi
Sakshi News home page

రారండోయ్‌ వేడుక చూద్దాం

Apr 27 2026 8:06 AM | Updated on Apr 27 2026 8:06 AM

ఉరవకొండ/ఉరవకొండ రూరల్‌: రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచిన లక్ష్మీ నారసింహుడి పుణ్యక్షేత్రాల్లో ఒకటైన పెన్నహోబిళం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఈనెల 28 నుంచి మే 9వ తేదీ వరకూ ఉత్సవాలు కొనసాగనున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

ఆలయ చరిత్ర..

పెన్నహోబిళం లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఎంతో చరిత్ర ఉన్నట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. విజయనగర సామ్రాజ్యాదీశుడైన సదాశివరాయులు విజయనగం నుంచి పెనుకొండకు వెళ్తూ ఈ క్షేత్రంలో మజలీ అయినట్లు ఆధారాలున్నాయి. ఆయనకు తన స్వప్నంలో స్వామి వారు కనిపించి నీ జైత్రయాత్ర దిగ్విజయమవుతుందని ఆశ్వీరదించినట్లు చెబుతారు. సదాశివరాయులు తన జైత్రయాత్ర ముగించుకొని తిరుగు ప్రయాణంలో స్వామి వారిని దర్శించుకొని స్వామి వారికి, లక్ష్మిదేవి అమ్మవారి ఆలయాలు నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. స్వామి వారి ఆలయ పాలనకు పెన్నహోబిళ శ్రోతియ గ్రామం దానంగా ఇచ్చారట. ఉదిరిపికొండ ప్రాంత రాజప్రతినిధి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి ఏకశిలగల ధ్వజ స్తంభంతో పాటు రాజు గుర్తుగా ఏకశిల విజయ స్తంభాన్ని క్షేత్రంలో ప్రతిష్టించారు. దాదాపు 45 అడుగుల ఎత్తుగల రెండు శిలలు ఇక్కడ కన్పిస్తాయి. ఇక్కడ లక్ష్మీనృసింహస్వామి, లక్ష్మిదేవి అమ్మవార్లు స్వయంభుగా వెలిశారు. ఈ క్షేత్రం పెన్నానది సమీపంలో ఉండటం, స్వామి వారి పాదముద్రిక కింది భాగాన బిలం ఉండటంతో పెన్నహోబిలంగా పిలవబడుతోంది. ఆలయంలో కింది భాగంలో ఉద్భవ లక్ష్మీదేవి ఆలయంలో 30 ఏళ్లుగా పుట్ట అక్కడ వెలసిన శిల ఎత్తుగా పెరగడం విశేషంగా చెప్పుకొవచ్చు.

28 నుంచి బ్రహ్మోత్సవాలు..

పెన్నహోబిళం లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 28 నుంచి ప్రారంభమవుతాయి. 28న ఆమిద్యాల గ్రామం నుంచి శ్రీవారి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా పెన్నహోబిళంకు తీసుకురావడంతో బ్రహ్మోత్సవాలకు అంకుర్పారణ జరగనుంది. 29న ధ్వజారోహణం, ప్రాకారోత్సవం, 30న సింహ వాహోనత్సవం, చంద్రప్రభ వాహనోత్సవం, మే 1న గో, శేష వాహనోత్వం, 2న హంస వాహనోత్సవం, 3న హనుమంత వాహనోత్సవం, 4న గరుడ వాహనోత్సవాలు జరుగుతాయి. అదే రోజు రాత్రి శ్రీవారి కల్యాణం, 5న సూర్యప్రభ, ఐరావత వాహనోత్సవం, 6న శ్రీవారి బ్రహ్మరథోత్సవం, 7న అశ్వ వాహనోత్సవం, 8న ధ్వజారోహణం, 9న ఉత్సవ మూర్తులు ఆమిద్యాలకు ఊరేగింపుగా చేరుకోవడంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

రేపటి నుంచి పెన్నహోబిళం

లక్ష్మీనృసింహుడి బ్రహ్మోత్సవాలు

4న గరుడ వాహనోత్సవం, శ్రీవారి కల్యాణం

6న బ్రహ్మ రథోత్సవం

అన్ని ఏర్పాట్లు చేశాం

మంగళవారం నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ధర్మకర్త మండలి చైర్మన్‌ రేగాటి నాగరాజు, ఈఓ సాకే రమేష్‌బాబు తెలిపారు. ఉమ్మడి అనంత జిల్లా నుంచే కాకుండా కర్ణాటక, ఇతర ప్రాంతాల నుంచి కూడా బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరాన్నట్లు పేర్కొన్నారు. వారికి భోజన వసతి, తాగునీరు, ఆలయ ఆవరణలో చలువ పందిళ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో బ్రహ్మోత్సవాలను విజయంతం చేస్తామన్నారు. పాత రథానికి మరమ్మతు నిర్వహించి ట్రయిల్‌ రన్‌ నిర్వహించామన్నారు.

– ఆలయ ధర్మకర్త మండలి చైర్మన్‌, ఈఓ

Advertisement
 
Advertisement
Advertisement