అనంతపురం టౌన్: జిల్లాలో గృహ నిర్మాణాలకు సంబంధించి ఆప్షన్–3 ఇళ్లను ఆప్షన్–1లో మార్పు చేసే పక్రియను వేగవంతం చేయాలని గృహ నిర్మాణ సంస్థ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ శైలజా అధికారులను ఆదేశించారు. ఆదివారం హౌసింగ్ డీఈ, ఏఈలతో టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 10 వేల ఇళ్లకు పైగా ఆప్షన్–3 కింద ఉన్నాయన్నారు. వాటి నిర్మాణ పనులు సైతం వివిధ దశల్లో ఉన్నాయన్నారు. లబ్ధిదారులతో చర్చించి ఆప్షన్–1 కిందకు మార్చేలా చర్యలు చేపట్టాలన్నారు. కొన్ని డివిజన్లలో ఆప్షన్ మార్పు ప్రక్రియ మందకోడిగా సాగుతోందన్నారు. ప్రధానంగా అనంతపురం అర్బన్ పరిధిలోని ఆలమూరు, కొడిమి లేఅవుట్లలో ఆప్షన్–3 లబ్ధిదారులతో మాట్లాడి మార్పు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.
గురుకులం విద్యార్థి అదృశ్యం
ఉరవకొండ: మండల పరిధిలోని కొనకొండ్ల బీసీ గురుకులంలో 7వ తరగతి చదువుతున్న కార్తీకేయ అదృశ్యమైనట్లు విద్యార్థి తండ్రి గురు ఆదివారం ఉరవకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురు మాట్లాడుతూ.. పాఠశాలలకు సెలవులు వదలడంతో తన కుమారుడిని అనంతపురంలోని తన చెల్లెలు ఇంట్లో వదిలిపెట్టానన్నారు. అయితే తిరిగి అనంతపురం నుంచి ఉరవకొండకు వచ్చిన తన కుమారుడు కనిపించకుండా పోయాడన్నారు. రెండు రోజుల నుంచి అన్నిచోట్లా వెతికినా ఆచూకీ లభ్యం కాలేదన్నారు. కార్తికేయ ఆచూకీ తెలిసిన వారు సెల్: 8074104223కు సమాచారం ఇవ్వాలన్నారు.
ఆర్ట్స్ కళాశాలలో
రేపు ఉద్యోగ మేళా
అనంతపురం ఎడ్యుకేషన్: స్థాని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) హొనూర్ ల్యాబ్ లిమిటెడ్ సంస్థ, జవహర్ నాలెడ్జ్ సెంటర్ (జేకేసీ) ఆధ్వర్యంలో ఈనెల 28న ఆర్ట్స్ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ పద్మశ్రీ ఒక ప్రకటనలో తెలిపారు. తృతీయ సంవత్సరం డిగ్రీ/ఫార్మసీ చదువుతున్న విద్యార్థులు, డిగ్రీ పూర్తీ చేసిన 21–28 మధ్య వయసు గల పురుషులు మాత్రమే పాల్గొనాలని సూచించారు. ఆసక్తి గల విద్యార్థులు విద్యార్హత సర్టిఫికెట్లు, బయోడేటా, ఆధార్ కార్డుతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని ప్రిన్సిపాల్‌తో పాటు జేకేసీ కోఆర్డినేటర్ జీవన్‌కుమార్ కోరారు. వివరాలకు 94413 88434 నంబరును సంప్రదించాలన్నారు.
పి.కొత్తపల్లికి చెందిన విద్యార్థి
గుజరాత్‌లో ఆత్మహత్య
పుట్లూరు: మండలంలోని పి.కొత్తపల్లికి చెందిన విద్యార్థి పవన్‌కుమార్ నాయుడు (19) గుజరాత్ రాష్ట్రంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామస్తుల వివరాలమేరకు.. రామానాయుడు, రాధమ్మ దంపతుల కుమారుడు పవన్‌కుమార్ నాయుడు గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ సమీపంలో ఉన్న అకలేశ్వర్ వద్ద ఉన్న పీపీ సవాణి యూనివర్సిటీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం తెల్లవారుజామున హాస్టల్ భవనం పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న మృతుడి తల్లిదండ్రులు, బంధువులు కన్నీటి పర్యంతమైయ్యారు. తమ ఏకై క కుమారుడు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడో తెలీడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మద్యం మత్తుకు
నిండు ప్రాణం బలి
● బైక్ ఢీ కొని వ్యక్తి మృతి
యాడికి: మద్యం మత్తు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. వివరాలు.. కర్నూలు జిల్లా మంత్రాలయంకు చెందిన రాజన్న (40) రెండేళ్లుగా యాడికి మండలం రాయలచెరువు వద్ద ఉన్న తమలపాకు తోటలో కూలి పనులు చేస్తున్నాడు. రాయలచెరువులోని ఉన్నత పాఠశాల వద్ద ఓ గదిని అద్దెకు తీసుకొని జీవనం సాగిస్తున్నారు. ఆదివారం సాయంత్రం రాజన్న పెరుగు ప్యాకెట్ తీసుకొని ఇంటికెళ్తున్నాడు. పెద్దవడుగూరు మండలం అప్పేచెర్లకు చెందిన దస్తగిరి ద్విచక్ర వాహనంతో చందన రైల్వేగేట్ వద్ద రాజన్నను బైక్‌తో ఢీకొనడంతో చనిపోయాడు. సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాసులు మృతుడి భౌతికకాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే దస్తగిరి తాగిన మైకంలో బైక్‌తో ఢీ కొనడంతో రాజన్న చనిపోయినట్లు స్థానికులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కదిరి అర్బన్: మండల పరిధిలోని కదిరి కుంట్లపల్లి వద్ద కదిరి – పులివెందుల రహదారిపై కారు.. ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న ప్రమాదంలో కదిరి కుంట్లపల్లి రాజారెడ్డి కాలనీకి చెందిన రామకృష్ణ (58) మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. రామకృష్ణ తన ద్విచక్ర వాహనంలో సొంత పని నిమిత్తం కదిరికి బయలుదేరాడు. కదిరి నుంచి పులివెందుల వైపు వెళ్తున్న కారు ఢీ కొనడంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


