ఇరు వర్గాల మధ్య చిచ్చుపెట్టిన రూ.500 నోటు | - | Sakshi
Sakshi News home page

ఇరు వర్గాల మధ్య చిచ్చుపెట్టిన రూ.500 నోటు

Apr 27 2026 8:06 AM | Updated on Apr 27 2026 8:06 AM

రాయదుర్గం టౌన్‌: పెట్రోల్‌ బంకులో రూ.500 వేరేది ఇవ్వమన్నందుకు పంప్‌బాయ్‌ దాడి చేసిన ఘటన ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. వివరాలు... రాయదుర్గం మండలం కెంచానపల్లికి చెందిన పెళ్లి బృందం రాయదుర్గంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో జరిగిన పెళ్లి వచ్చారు. వివాహం తర్వాత తిరిగి స్వగ్రామానికి బయలు దేరారు. 74 ఉడేగోళం వద్ద ఉన్న పెట్రోల్‌ బంక్‌ వద్ద డీజల్‌ నింపుకుని పంప్‌ బాయ్‌ మంజునాథకు రూ.500 నోటు ఇచ్చారు. అయితే నోటుకు రంగు అయిందని వేరేది ఇవ్వాలని మంజునాథ అభ్యర్థించాడు. దీంతో పెళ్లి బృందంలోని కొందరు ఆగ్రహంతో పంప్‌బాయ్‌ మంజుపై దాడి చేశారు. దీన్ని అడ్డుకున్న మరో పంపుబాయ్‌ అశోక్‌పై కూడా దాడి చేశారు. దాడికి గురైన ఇద్దరు ఉడేగోళం గ్రామానికి చెందిన వారు. విషయం తెలుసుకున్న వారి బంధువులు మంజు, అశోక్‌తో కలిసి ఫిర్యాదు చేసేందుకు పట్టణంలోని స్టేషన్‌కు వెళుతుండగా స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే కెంచానపల్లికి చెందిన కొందరు కారులో వచ్చి తమపై దాడి చేసినట్లు బాధితులు వాపోయారు. దాడిలో మంజు, అశోక్‌తో పాటు సిద్దేశ్‌ గాయపడ్డారు. హుటాహుటిన వారిని ఆస్పత్రిలో చేర్పించిన తర్వాత బాధితుల బంధువులు పెద్ద ఎత్తున ఆస్పత్రి బయట ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కాగా ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అనుచరులే కారులో వచ్చి దాడి చేసినట్లు బాధితుల బంధువులు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అర్బన్‌ సీఐ జయనాయక్‌ ఆస్పత్రికి వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఇరువర్గాల ఫిర్యాదు తర్వాత విచారణ చేపట్టి చర్యలు చేపడతామని సీఐ తెలిపారు.

పెట్రోల్‌ బంకు బాయ్స్‌పై దాడి

Advertisement
 
Advertisement
Advertisement