అనంతపురం సెంట్రల్: అభం శుభం తెలియని చిన్నారిపై ఏడు పదుల వయస్సున్న ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన అనంతపురం నగర శివారులోని రుద్రంపేటలో చోటు చేసుకుంది. వివరాలు.. స్థానికంగా ఉంటున్న ఖాజా హుస్సేన్ (70) ఈ నెల 24న పదేళ్ల బాలికపై అత్యాచారానికి యత్నించాడు. సదరు బాలిక ఓ పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. సెలవులు కావడంతో ఇంటి వద్ద ఆడుకుంటుండగా నిందితుడు గమనించాడు. ఐస్‌క్రీం కొనుక్కునేందుకు డబ్బు ఇస్తానని ఆశ చూపి ఇంట్లోకి రప్పించుకుని గడియపెట్టాడు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు గమనించి తల్లికి సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె వెంటనే అక్కడికి చేరుకుని బాలికను రక్షించారు. మరుసటి రోజు కాలనీ వాసులందరికీ తెలియడంతో నిందితుడిని చితకబాది గుండుగీసి ఊరేగించారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ శశికళ ఆదివారం ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లి స్థానికులను విచారించారు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. అనంతరం ప్రాజెక్టు డైరెక్టర్ శశికళ 4వ పట్టణ పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఇన్‌చార్జ్ సీఐ శ్రీకాంత్‌యాదవ్‌తో చర్చించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో సుమోటోగా కేసు నమోదు చేసి, నిందితుడిని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు సీఐ తెలిపారు.
నిందితుడిని చితకబాదిన స్థానికులు


