తాడిపత్రిటౌన్: తాడిపత్రి నియోజకవర్గంలో భూగర్భజలాలు అడుగంటడంతో రైతులు పంటలను కాపాడుకునేందుకు భగీరథప్రయత్నం చేస్తున్నారు. తాడిపత్రి, యాడికి, పెద్దవడుగూరు, పెద్దపప్పూరు మండలాల్లో ఎక్కువగా బోరు బావుల కింద పండ్లతోటలు సాగువుతున్నాయి. ఆయా మండలాల్లోని రిజర్వాయర్లు, చెరువులు నీరు లేక ఎండిపోతున్నాయి. దీంతో ఆయా మండలాల్లో రోజురోజుకూ భూగర్భజలాలు ఆవిరవుతుండటంతో బోరుబావుల్లో నీరు రాక వేలాది ఎకరాల్లో ఉన్న అరటి, మామిడి, చీనీ, నిమ్మ పంటలను కాపాడుకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. పంటలను కాపాడుకునేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేస్తున్నారు. ఒక్క పంట తడికి వేల రూపాయలు ఖర్చుచేస్తూ అప్పుల ఊబిలో కూరుకపోతున్నారు. ఇదే అదునుగా ట్యాంకర్ యజమానులు ఒక్కో ట్యాంకర్ నీటిని రూ.800 నుంచి రూ.1,200 వరకు అమ్ముతున్నారు. ప్రభుత్వం స్పందించి పంటలకు నీరిచ్చి కాపాడేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.


