కూడేరు: ట్రాక్టర్ కింద పడి మహిళా కూలీ శివలింగమ్మ (50) మృతి చెందిన ఘటన ఆదివారం కూడేరు మండల పరిధిలోని అంతరగంగలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాలమేరకు.. ఇప్పేరుకు చెందిన సత్యం, శివలింగమ్మ దంపతులు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. దంపతులిద్దరూ వ్యవసాయ కూలీ పనులకు వెళ్లి జీవనం సాగిస్తున్నారు. ఆదివారం అంతరగంగకు చెందిన ఓ రైతు పొలంలోని వేరుశనగలో కలుపు మొక్కలు తొలగింపునకు శివలింగమ్మ కూలి పనికి వెళ్లింది. అక్కడ ట్రాక్టర్ ట్రాలీ కింద కూలీలు భోజనానికి కూర్చున్నారు. అది గమనించని డ్రైవర్ ట్రాక్టర్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్లే ప్రయత్నం చేశాడు. కూలీలు కేకలు వేయడంతో వెంటనే అప్రమత్తమై బ్రేక్ వేశాడు. అంతలోపే టైర్ శివలింగమ్మ తలకు తగిలింది. వెంటనే ఆమెను అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


