అనంతపురం కల్చరల్: అనంత వేదికగా దశాబ్దాల పాటు డాక్టర్ రాధేయ ఉత్తమ సాహిత్యాన్ని ప్రోత్సహిస్తుండడం అభినందనీయమని వక్తలన్నారు. ప్రతిష్టాత్మక కవితా సంపుటాలకందించే ఉమ్మడిశెట్టి అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం నగరంలోని ప్రభుత్వ కళాశాల వేదికగా సాగింది. అలాగే ఇటీవల రాధేయ వెలువరించిన కొత్త విమర్శ వ్యాసాల సంపుటి ‘అలజడి మా జీవితం’ పుస్తకావిష్కరణ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా పలువురు రచయితలు, కవులు అవార్డులనందుకున్నారు. ఉమ్మడిశెట్టి సత్యాదేవి పురస్కారాన్ని శ్రీకాకుళం నుంచి విచ్చేసిన కంచరాన భుజంగరావు, ఉమ్మడిశెట్టి సతీష్ జాతీయ యువ పురస్కారాన్ని సిద్ధిపేటకు చెందిన జాబేర్ షాషా, అలాగే ఒంగోలుకు చెందిన చరణ్‌పరిమి అందుకున్నారు. కవియిత్రి సుమన ప్రణవ్‌లు లిటరరీ ట్రస్టు సత్కారాలందుకుంది. డాక్టర్ సుంకర గోపాల్, డాక్టర్ పెళ్లూరు సునీల్, దోర్నాథుల సిద్దార్థ, డాక్టర్ అంకె శ్రీనివాస్ అవార్డులు పొందిన కవుల పుస్తకాలను సమీక్షించారు.


