వ్యక్తి దారుణ హత్య | - | Sakshi
Sakshi News home page

వ్యక్తి దారుణ హత్య

Apr 7 2026 7:37 AM | Updated on Apr 7 2026 7:37 AM

గుంతకల్లు: తోడల్లుళ్ల మధ్య చోటు చేసుకున్న వివాదం కాస్త ఒకరి హత్యకు దారి తీసింది. పోలీసులు తెలిపిన మేరకు... పాత గుంతకల్లులో నివాసముంటున్న మజ్జిగ కృష్ట (49)కు భార్య రామలక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. లారీడ్రైవర్‌గా కృష్ణ, టైలర్‌గా రామలక్ష్మి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. పెద్ద కుమారుడు ప్రేమ్‌కుమార్‌ పోలీస్‌ ట్రైనింగ్‌లో ఉండగా, రెండో కుమారుడు మహేష్‌ డిగ్రీ చదువుతున్నాడు. ఈ క్రమంలో 15 ఏళ్ల క్రితం రమాదేవితో కృష్ణ చనువుగా ఉండేవాడు. ఇది కాస్త వివాదానికి దారితీయడంతో అప్పట్లో పెద్దల సమక్షంలో రాజీ కుదుర్చుకుని కొంత డబ్బును పరిహారంగా ఆమెకు కృష్ణ చెల్లించాడు.

విధానాలు మార్చుకోమన్నందుకు కక్ష కట్టి

పాత గుంతకల్లు ప్రాంతంలోనే కృష్ణ మరదలు గంగమ్మ (స్వయానా భార్య చెల్లెలు) తన భర్త కొనకొండ్లకు చెందిన లింగయ్యతో కలసి నివాసముంటోంది. మద్యానికి బానిసైన లింగయ్య తరచూ మత్తులో భార్యతో గొడవపడేవాడు. ఈ విషయం ఆమె ద్వారా తెలుసుకున్న బావ కృష్ణ జోక్యం చేసుకున్నాడు. లింగయ్యను కలిసి తాగుడు మానేయాలని, అనవసరంగా గొడవలు పడొద్దని హితవు పలికాడు. దీంతో కక్ష పెంచుకున్న లింగయ్య... నేరుగా వెళ్లి రమాదేవిని కలిసి కృష్ణతో తక్కువ మొత్తంలో పరిహారం కట్టించుకున్నావని, మరింత డబ్బు లాక్కోవాలన్నాడు. ఆ సమయంలో రమాదేవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనకు కృష్ణతో ఎలాంటి సంబంధం లేదని, అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదంటూ హితవు పలికింది. తర్వాత కొన్ని రోజులకు మరోసారి రమాదేవిని ఆమె ఇంట్లోనే కలిసిన లింగయ్య... కృష్ణతో ఉన్నట్లుగానే తనతో కూడా చనువుగా ఉండాలని ఒత్తిడి చేశాడు. ఆ సమయంలో తీవ్ర ఆవేశానికి లోనైన రమాదేవి తన అక్కతో కలిసి లింగయ్యను చెప్పుతో కొట్టింది. ఇందుకు కారణం కృష్ణానే అని కక్ష పెంచుకున్న లింగయ్య నేరుగా అతని ఇంటికెళ్లి చంపుతానని బెదిరించాడు.

పథకం ప్రకారం..

సోమవారం ఉదయం కృష్ణ దంపతులు పాతగుంతకల్లులోని శివాలయానికి వెళ్లి మొక్కులు చెల్లించుకున్న అనంతరం ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. సమీపంలోని ఆర్చి వద్దకు చేరుకోగానే అక్కడే కాపు కాసిన లింగయ్య వెంటనే ద్విచక్ర వాహనానికి అడు తగిలి కృష్ణ కళ్లలోకి కాారం చల్లాడు. దీంతో బైక్‌ అదుపు తప్పి కృష్ణ దంపతులు కిందపడ్డారు. ఆ సమయంలో కృష్ణ తలపై ఇనుప రాడ్‌తో లింగయ్య వరుస దాడులు చేశాడు. రామలక్ష్మి కేకలు విన్న స్థానికులు అక్కడకు చేరుకోనేలోపు పారిపోయాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న భర్తను వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి రామలక్ష్మి తీసుకెళ్లింది. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై రామలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న కృష్ణ కోసం గాలింపు చేపట్టారు.

కళ్లలోకి కారం కొట్టి... రాడ్‌తో తలపై మోది

దారి తీసిన తోడల్లుళ్ల మధ్య వివాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement