శింగనమల: గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌తోనే సాధ్యమైందని, మళ్లీ ఆ రోజులు రావాలంటే వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ మంత్రి, శింగనమల వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త సాకే శైలజానాథ్ అన్నారు. ఇటీవల పదవీ విరమణ పొందిన నియోజకవర్గంలోని వైఎస్సార్‌సీపీ మద్దతు సర్పంచులను బీకేఎస్‌లోని ఆ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో సోమవారం ఘనంగా సన్మానించారు. పార్టీ నియోజకవర్గ పీఆర్ విభాగం అధ్యక్షుడు కంచిరెడ్డి భాస్కరరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా సాకే శైలజానాథ్, వైఎస్సార్‌సీపీ పీఆర్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి హాజరయ్యారు. శైలజానాథ్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలు బలోపేతం కావాలంటే దృఢమైన నాయకత్వం అవసరమన్నారు. ఆ నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనమే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని అన్నారు. వైఎస్ జగన్ స్ఫూర్తితోనే సర్పంచులు నిస్వార్థంగా పనిచేస్తూ గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతో ఇబ్బంది పెట్టినా, నిదులు విడుదల చేయకపోయినా, ప్రజల అవసరాలను తీరుస్తూ రావడం గొప్ప విషయమన్నారు. వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి మాట్లాడుతూ... ఇంత కాలం చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని, ఈ విషయంగా బిల్లులు మంజూరయ్యే వరకూ పోరాటం సాగిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ నాగరత్నమ్మ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు నార్పల సత్యనారాయణరెడ్డి, గువ్వల శ్రీకాంతరెడ్డి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి తరిమెల వంశీగోకుల్‌రెడ్డి, డీసీఎంఎస్ మాజీ డైరెక్టర్ శ్రీరామిరెడ్డి, మండల కన్వీనర్లు శ్రీకాంతరెడ్డి, ఎల్లారెడ్డి, పరంధామరెడ్డి, ఖాదర్‌వలిఖాన్, మహేశ్వరరెడ్డి, శివశంకర్, నాయకుడు నాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు.
మాజీ మంత్రి సాకే శైలజానాథ్


