వజ్రకరూరు: మండల కేంద్రంలో వెలసిన జనార్దన వేంకటేశ్వరస్వా మి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి శ్రీవారి కల్యాణోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు, విశేష అలంకరణలు పెద్ద ఎత్తున జరిగాయి. రాత్రి జరిగిన కల్యాణోత్సవానికి మాజీ సర్పంచ్ మోనాలిసా, పంచాయతీ, సచివాలయ ఉద్యోగులు, సిబ్బంది స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ అంగదాల కృష్ణయ్య, ప్రధాన అర్చకుడు నరసింహమూర్తి, గ్రా మపెద్దలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం రథోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ వెల్లడించారు.
రైల్వే డివిజన్ పరిధిలో పలువురికి అవార్డులు
గుంతకల్లు: స్థానిక రైల్వే డివిజన్ పరిధిలో విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన ఇద్దరు ఉద్యోగులకు మ్యాన్ అఫ్ మంత్ అవార్డులను డీఆర్‌ఎం చంద్రశేఖర్ గుప్తా సోమవారం అందజేశారు. వీరిలో ట్రైన్ మేనేజర్ హనుమంతు, పాయింట్స్‌మెన్ సచీంద్ర ఉన్నారు. ఓ రైలు ప్రయాణికుడు గాయపడిన సమాచారం అందుకున్న ట్రైన్ మేనేజర్ హనుమంతు సకాలంలో స్పందించి సమీపంలోని రైల్వేస్టేషన్‌కు సమాచారం చేరవేసి మెరుగైన వైద్యసేవలు అందించడంలో సఫలీకృతుడయ్యాడు. అలాగే బోగీ చక్రాల్లో వస్తున్న శబ్ధాల్లో తేడాను పసిగట్టి వెంటనే సంబంధిత అధికారులను అప్రమత్తం చేసి పెను ప్రమాదాన్ని పాయింట్స్‌మెన్ సచీంద్ర నివారించాడు. ఈ నేపథ్యంలో వారిని అభినందిస్తూ మ్యాన్ ఆఫ్ మంత్ అవార్డులను అందజేశారు. కార్యక్రమంలో ఏడీఆర్‌ఎం సుధాకర్, సీనియర్ డీఓఎం శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
గడ్డి వాముల దగ్ధం
పుట్లూరు: మండలంలోని శనగలగూడూరులో సోమవారం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి రైతులు వెంకటేశ్వరరెడ్డి, సుబ్బరాయుడుకు చెందిన రెండు గడ్డివాములు దగ్ధమయ్యాయి. ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే స్థానికులు పోలీసులకు, అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. అయితే యాడికి మండలంలో సీఎం చంద్రబాబు పర్యటన ఉండటంతో అక్కడికి ఫైర్ ఇంజన్లు వెళ్లాయని సిబ్బంది తెలపడంతో చివరకు రైతులు ట్యాంకర్ల ద్వారా మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. శనగలగూడూరుతో పాటు అందుబాటులో ఉన్న చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతులు ట్రాక్టర్ ట్యాంకర్లను తీసుకొచ్చారు. మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు.


