జూనియర్‌ కాలేజీలకు కొత్త టైమింగ్‌ | - | Sakshi
Sakshi News home page

జూనియర్‌ కాలేజీలకు కొత్త టైమింగ్‌

Apr 1 2026 7:42 AM | Updated on Apr 1 2026 7:42 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: జూనియర్‌ కళాశాలల పని వేళలు మార్చారు. గతంలో 9.30 నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు ఉండేవి. అయితే గతేడాది మధ్యలోనే ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉండేలా అమలు చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి కూడా కొత్త వేళలే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు మండిపడుతున్నారు. ఈ విషయంపై మంగళవారం డీవీఈఓ గురవయ్యశెట్టిని కలిసిన ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, కాంట్రాక్ట్‌, అతిథి అధ్యాపకులు వినతిపత్రం అందజేశారు. సాయంత్రం 5 గంటల వరకు కళాశాలలు పెట్టుకోవడం వల్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థినులు, మహిళా అధ్యాపకులు ఇంటికి చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడతారన్నారు. రవాణా సదుపాయం లేకపోవడంతో ఇళ్లకు చేరుకోవడం కష్టంగా ఉంటుందన్నారు. ఆడపిల్లల భద్రత ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. సాయంత్రం 4 గంటల తర్వాత విద్యార్థులు అందరూ ఇంటికి వెళ్లి పోతున్నారని గుర్తు చేశారు. అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లు మాత్రమే ఉండాల్సి వస్తోందన్నారు. ఇంటర్మీడియెట్‌ బోర్డు ఏర్పాటైనప్పటి నుంచి 2024 –2025 విద్యా సంవత్సరం వరకు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు టైమింగ్‌ ఉండేదన్నారు. 2025–2026 విద్యా సంవత్సరంలో ఈ సమయాలను మార్పు చేశారని ఫలితంగా అనేక సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. విద్యార్థుల హాజరు, సిబ్బంది సౌలభ్యం, భద్రత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పూర్వపు వేళల అమలుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని డీవీఈఓ హామీ ఇచ్చారు.

నేటి నుంచి జూనియర్‌ కళాశాలల తరగతులు ప్రారంభం

జూనియర్‌ కళాశాలల్లో బుధవారం నుంచి తరగతులు ప్రారంభమవుతాయని డీవీఈఓ గురవయ్యశెట్టి తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రోజూ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కళాశాలలు నిర్వహించాలని ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. విద్యార్థులను కళాశాలలకు పంపేలా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని డీవీఈఓ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు

గతంలో 9:30 నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement