నగర పాలికలో రుద్రజాలం | - | Sakshi
Sakshi News home page

నగర పాలికలో రుద్రజాలం

Apr 1 2026 7:36 AM | Updated on Apr 1 2026 7:36 AM

అనంతపురం క్రైం/ అర్బన్‌: అధికారం మనదే.. అధికారులు మనం ఆడించినట్లు ఆడుతారు. మనల్ని అడిగేవారు, ఆడ్డుకునేవారు ఎవరూ లేరు.. ఉండరన్న బరితెగింపు.. అధికారపార్టీకి చెందిన ప్రజాప్రతినిధి అహంకారం. ఆయనే కాదు.. ఆయన రక్తసంబంధీకులు కూడా అదే బాటలో నడుస్తున్నారు. ప్రజాధనాన్ని దోచుకునేందుకు అడ్డదారులను ఎంచుకున్నారు. కోట్ల రూపాయలు దండుకునేందుకు నగరపాలక సంస్థను వేదికగా చేసుకున్నారు. నకిలీ కాంట్రాక్ట్‌ కంపెనీ పేరుతో రిజిస్ట్రేషన్‌ పత్రాలు సృష్టించారు. వాటితో కోట్ల రూపాయల పనుల టెండర్లు దక్కించుకున్నారు. కాసులముందు అధికారుల కళ్లు మూసుకుపోయాయి. రిజిస్ట్రేషన్‌ అయ్యిందా లేదా అనేది పట్టించుకోలేదు. అదే పార్టీలోని ఓ సీనియర్‌ కాంట్రాక్టర్‌ ఈ విషయాన్ని పసిగట్టాడు. రాత్రికి రాత్రి ప్రజాప్రతినిధి రక్తసంబంధీకులు ఎలా కాంట్రాక్టర్లు ఆయ్యారని ఆరా తీశారు. సమాచార హక్కు చట్టం కింద తీసుకున్న ప్రాథమిక సమాచారంతో అసలు గుట్టు రట్టయ్యింది.

నకిలీ సంస్థ బాగోతం వెలుగులోకి.. : కాంట్రాక్టు పనులు చేయాలనుకునేవారు రోడ్లు, భవనాల శాఖలో కాంట్రాక్టు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. నీరుగంటి వీధికారి చెందిన ఆర్‌.శ్రీనివాసచౌదరి గత నెల 7న సమాచార హక్కుచట్టం కింద రుద్ర ఇన్‌ఫ్రా క్లాస్‌–3 కాంట్రాక్టు రిజిస్ట్రేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న తేదీ కోరారు. అదేవిధంగా జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ (నంబర్‌ 37ఏబీజేఏఆర్‌6980ఎల్‌1జెడ్‌బీ) ఎప్పుడు జారీ చేశారు. కార్యాలయానికి ఎప్పుడు అందజేశారు.. క్లాస్‌–3 కాంట్రాక్టుకు సంబంధించి అనుభవ పత్రాలు అందజేశారా.. 2024 డిసెంబరు ఆరో తేదీకి సంబంధించిన పత్రాల సమాచారాన్ని ఇవ్వాలంటూ రోడ్లు, భవనాల శాఖ పర్యవేక్షక ఇంజినీర్‌ను కోరారు. దీంతో ‘రుద్ర ఇన్‌ఫ్రా సంస్థ’కు సంబంధించి అనంతపురం ఆర్‌అండ్‌బీ సర్కిల్‌ పరిధిలో ఎలాంటి రిజిస్ట్రేషనూ కాలేదంటూ ఆ శాఖ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ ఎ.గురుప్రసాద్‌ లిఖితపూర్వకంగా సమాచారం అందించారు. దీంతో ‘రుద్ర’ నకిలీ బాగోతం వెలుగుచూసింది.

రుద్ర ఇన్‌ఫ్రా పేరుతో పనులు : శ్రీనగర్‌ కాలనీలో 80 అడుగుల రోడ్డు ఎక్స్‌టెన్షన్‌ క్రాస్‌ రోడ్డు నుంచి వరదాపురం సూరి కార్యాలయం వరకు అంచనా వ్యయం రూ.61.66 లక్షలతో బీటీ రోడ్డు పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం టీడీపీ కార్యాలయం వద్ద రూ.కోటి వ్యయంతో సీసీ రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఇక్కడ విచిత్రం ఏమిటంటే బాగున్న రహదారిని ధ్వంసం చేసి కొత్త రోడ్డు నిర్మించడంపై స్థానికుల నుంచి విమర్శలు వినవస్తున్నాయి.

● సోమనాథనగర్‌ నడిమివంక నుంచి రామాలయం వరకు రూ.42 లక్షల అంచనా వ్యయంతో బీటీ రోడ్డు వేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇవికాకుండా సుమారు రూ.10 కోట్ల అంచనా వ్యయంతో ఉన్న 50కి పైగా సివిల్‌ పనులు ఇతర కాంట్రాక్టర్లతో ఒప్పందం చేసుకుని దోపిడీ సాగించినట్లు విశ్వసనీయ సమాచారం.

ముందే చెప్పిన ‘సాక్షి’ : అనంతపురం నగర పాలక సంస్థ పరిధిలో రూ.కోట్ల నిధులు దారిమళ్లుతున్న విషయాన్ని ఆధారాలతో సహా ‘సాక్షి’ పలు కథనాలను ప్రజలముందుంచింది. అయితే జిల్లా ఉన్నతాధికార యంత్రాంగం ఈ అంశాన్నీ పట్టించుకోలేదు. దీంతో ప్రజాప్రతినిధి వర్గం మరింత చెలరేగిపోయింది. పర్యవరణ పరిరక్షణ పేరుతో ఉచితంగా అందించిన సంచులు, మహాత్ముని విగ్రహానికి రంగులు అద్దడం పనులతో పాటు ఎవరో వేసిన రహదారులకు లక్షల రూపాయలు అప్పనంగా బిల్లులు పెట్టుకుని దోచుకునేదాకా చేతివాటం సాగించారు. ఈ తరహా దోపిడి పదుల సంఖ్యలో సాగింది. తాజాగా హోర్డింగ్స్‌ లైసెన్స్‌దారుల జాబితాలో కూడా నకిలీ పేర్లు చొరబడ్డాయి.

మా రికార్డుల్లో లేదు

రుద్ర ఇన్‌ఫ్రా సంస్థకు సంబంధించి రిజిస్ట్రేషన్‌ ఇక్కడ ఇవ్వలేదు. అందుకు సంబంధించి రికార్డులు ఆర్‌అండ్‌బీలో లేవు. దానిపై పరిశీలన చేయాల్సి ఉంది. ఇక చర్యలు తీసుకోవాల్సిన అధికారం మాకు లేదు.

– మురళీకృష్ణ, ఎస్‌ఈ, ఆర్‌అండ్‌బీ

నకిలీ ఇన్‌ఫ్రా కంపెనీ దందా

50కి పైగా నిర్మాణాల పేరుతో రూ.కోట్ల దోపిడీ

తాజాగా రూ.కోటితో సీసీ రోడ్డు నిర్మాణ పనులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement