రాయదుర్గంటౌన్: ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలో (ఏపీ మోడల్ స్కూల్) 2026–27 విద్యాసంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియలో మిశ్రమ స్పందన లభించింది. జిల్లాలో 15 మోడల్ స్కూళ్లు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఐదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఆరో తరగతి ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకున్నారు. మార్చి 31తో దరఖాస్తుల గడువు ముగిసింది. మొత్తం 2,313 మంది విద్యార్థుల దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా స్వీకరించారు. దాదాపు ఆరు స్కూళ్లలో కనీసం దరఖాస్తుల సంఖ్య డబుల్ డిజిట్ దాటని పరిస్థితి ఉంది. మిగతా స్కూళ్లలో ఆశాజనకంగా దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో మోడల్ స్కూల్‌లో ఆరో తరగతిలో వంద సీట్ల ప్రవేశాలకు ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.


