కూడేరు: ఎండలు భగభగ మండుతున్నాయి. ముద్దలాపురానికి చెందిన సుమన్ భార్య పర్మిల (26) అనే కూలీ వడదెబ్బకు గురై మంగళవారం మృతి చెందింది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. పర్మిల భర్తతో పాటు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేది. ఎండలో పని చేస్తుండటం వల్ల రెండు రోజులుగా తలనొప్పితో బాధపడుతోంది. అయినా మంగళవారం ఓ రైతు పొలంలో బ్యాడిగి మిర్చి తొలగించే పనికి వెళ్లింది. అక్కడ ఉన్నపళంగా తలనొప్పి ఎక్కువ కావడంతో కుటుంబ సభ్యులు కూడేరు పీహెచ్‌సీకి తీసుకొచ్చారు. వైద్యులు పరీక్షించి.. పర్మిల మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈమెకు కుమారుడు, కుమార్తె ఉన్నారు.
కనులపండువగా
సంగమేశ్వరుడి బ్రహ్మోత్సవాలు
కూడేరు: మండల కేంద్రం కూడేరులో పార్వతీపరమేశ్వర స్వయంభు జోడులింగాల సంగమేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం జోడు లింగాలకు ఆలయ అర్చకులు శివశంకర్ శాస్త్రి, ప్రవీణ్, మహేష్ స్వాములు క్షీర, రుద్రాభిషేకాలు నిర్వహించి, భక్తులకు దర్శనభాగ్యం కల్గించారు. రాత్రి 8 గంటలకు కమ్మ కులస్తుల సంఘం ఆధ్వర్యంలో నంది వాహనంపై పార్వతీ పరమేశ్వరుడు కొలువుదీరి గ్రామంలో మంగళవాయిద్యాల నడుమ విహరించారు. కమ్మకులస్తులు, గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక పూజలు చేయించారు.
డీఆర్‌డీఏ పీడీగా సుధాకర్‌రెడ్డి
అనంతపురం టౌన్: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) పీడీగా ఆర్.సుధాకర్‌రెడ్డిని ఆశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా నీటియాజమాన్య సంస్థ (డ్వామా) కార్యాలయంలో వాటర్‌షెడ్ విభాగం ఏపీడీగా పనిచేస్తున్న సుధాకర్‌రెడ్డికి పదోన్నతి కల్పిస్తూ డీఆర్‌డీఏ పీడీగా నియమించారు. ఇక్కడ ఇన్‌చార్జ్ పీడీగా పని చేస్తున్న శైలజను సమగ్రశిక్ష ఏసీపీగా మాత్రమే కొనసాగనున్నారు. మరో మూడు రోజుల్లో సుధాకర్‌రెడ్డి పీడీగా బాధ్యతలు చేపట్టనున్నారు.
నేడు పింఛన్ల పంపిణీ
అనంతపురం టౌన్: ఎన్‌టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లు బుధవారం జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేయనున్నట్లు డీఆర్‌డీఏ ఏపీడీ రాధారాణి మంగళవారం తెలిపారు. అన్ని రకాల పింఛన్‌దారులు 2,76,547 మందికి గాను రూ.124కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఆయా పంచాయతీలలోని సచివాలయ ఉద్యోగులు పింఛన్ నిధులను డ్రా చేసినట్లు వెల్లడించారు. నేడు ఉదయం 6 గంటల నుంచి పింఛన్ పంపిణీ మొదలవుతుందన్నారు. తొలిరోజు పింఛన్ తీసుకోని వారికి రెండో తేదీ మధ్యాహ్నం సచివాలయాల్లో అందజేయనున్నట్లు తెలిపారు.


