ఘరానా మోసగాళ్ల ముఠా అరెస్టు | - | Sakshi
Sakshi News home page

ఘరానా మోసగాళ్ల ముఠా అరెస్టు

Mar 30 2026 8:32 AM | Updated on Mar 30 2026 8:32 AM

రాయదుర్గం: అమాయకులకు లాభాల ఆశ చూపి.. వారి నుంచి నగదు వసూలు చేసుకుని మోసగిస్తూ.. ఎవరైనా నిలదీస్తే చంపుతానని బెదిరింపులకు దిగుతూ, అప్పుడప్పుడూ దారిదోపిడీలకు సైతం తెగబడుతున్న ముఠా గుట్టును రాయదుర్గం రూరల్‌ పోలీసులు రట్టు చేశారు. ముగ్గురు సభ్యులున్న ముఠాను అరెస్టు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.10 కోట్లకు పైగా మోసాలకు పాల్పడినట్లు ఈ ముఠాపై 15 పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఆదివారం రాయదుర్గం సర్కిల్‌ కార్యాలయం వద్ద సీఐ వెంకటరమణ వివరాలు వెల్లడించారు. గార్లదిన్నె మండలం కొప్పలకొండకు చెందిన బెస్త ఓబులేసు నార్పల చుట్టుపక్కల ప్రాంతాల్లో గుజిరీ వ్యాపారం చేసేవాడు. అయితే ఇందులో వచ్చే ఆదాయం చాలడం లేదని చక్కెర, సిగరెట్ల హోల్‌సేల్‌ వ్యాపారిగా అవతారమెత్తాడు. ఈ క్రమంలో పామిడికి చెందిన పెరుమాళ్ల రామకృష్ణారెడ్డి, నార్పల మండలం కర్ణపుడికి చెందిన బెస్త మహేంద్రతో జత కట్టాడు. స్కార్పియో వాహనం తీసుకుని తమ కార్యకలాపాలు మొదలుపెట్టారు. ఓబులేసు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ మనోహార్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, చక్కరరెడ్డి పేర్లతో దుకాణదారులను కలిసి తనవద్ద రూ.లక్ష సరుకు కొంటే రూ.10వేలు ఆదాయం పొందవచ్చని ఆశ చూపించాడు. దీంతో చాలామంది అతడి మాటలు నమ్మి డబ్బు చెల్లించారు. ఒక్కో ప్రాంతంలో కోటి రూపాయల దాకా వసూలు చేశాక అక్కడి నుంచి మరొక చోటుకు మకాం మార్చేసేవాడు. కొన్ని ప్రాంతాల్లో గొర్రెల వ్యాపారం చేసేవాడు. ఎక్కువ ఖరీదు కట్టి.. అడ్వాన్సు చెల్లించి గొర్రెలను తీసుకెళ్లి.. తర్వాత డబ్బు చెల్లించకుండా తప్పించుకునేవాడు.

బాధితుడి ఫిర్యాదుతో...

బొమ్మనహాళ్‌ మండలం నేమకల్లులో బోయ గోవిందును కలిసి.. అతనివద్ద ఉన్న గొర్రెలను కొనడానికి బేరం కుదరకపోవడంతో వెనుదిరిగాడు. అయినా రెండు రోజులుగా ఆ ప్రాంతంలోనే సంచరిస్తున్నాడు. బోయగోవిందు ఎత్తినబూదేహాళ్‌లో బంధువుల వద్ద రూ.1.50 లక్షల నగదు తీసుకుని స్వగ్రామం నేమకల్లుకు ద్విచక్రవాహనంపై తిరిగి వస్తుండగా మార్గ మద్యంలో యూనిక్‌ క్రషర్‌ చెక్‌పోస్టు వద్ద స్కార్పియో వాహనంలో వచ్చిన ఓబులేసు బృందం అడ్డుకుంది. చాకుతో బెదిరించి అతడి జేబులోని నగదును దోచుకుని ఉడాయించింది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. రాయదుర్గం రూరల్‌ సీఐ వెంకటరమణ ఆధ్వర్యంలో విచారణ జరిపితే అసలు బాగోతం వెలుగులోకి వచ్చింది. ఉద్దేహాళ్‌లో ఓ గదిని ఓబులేసు బృందం అద్దెకు తీసుకుని, ఫేక్‌ ఐడీలతో సిమ్‌లు కొనడం, అవసరం తీరాక తీసేయడం చేస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఆదివారం నేమకల్లు సమీపంలో ఇన్‌చార్జ్‌ ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డి వాహనాలు తనిఖీ చేస్తుండగా స్కార్పియోలో వచ్చిన ఓబులేసు బృందాన్ని పట్టుకుని విచారణ చేయడంతో వీరి మోసాలు బయటపడ్డాయి. ఓబులేసు, పెరుమాళ్ల రామకృష్ణారెడ్డి, బెస్త మహేంద్రలపై తాడిపత్రి, యర్రగుంట, ప్యాపిలి, ఆత్మకూరు, మెలకలచెరువు, కలికిరి, నల్లచెరువు, నెల్లూరు, యర్రగొండపాళ్యం, సోమందేపల్లి, గార్లదిన్నె, కూడేరు, ప్రకాశం జిల్లాలోని పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు ఉన్నట్లు తేలాయి. ఘరానా మోసగాళ్ల ముఠాను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరచిన రూరల్‌ సీఐ వెంకటరమణ, సిబ్బందిని ఎస్పీ జగదీష్‌, డీఎస్పీ రవిబాబు అభినందించి, రివార్డులు ప్రకటించారు. విలేకరుల సమావేశంలో కణేకల్లు ఎస్‌ఐ నాగమధు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా

రూ.10 కోట్లకు పైగా మోసం

15 పోలీస్‌స్టేషన్లలో కేసుల నమోదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement