చట్టబద్ధత పేరుతో చంద్రబాబు కొత్త నాటకం | - | Sakshi
Sakshi News home page

చట్టబద్ధత పేరుతో చంద్రబాబు కొత్త నాటకం

Mar 30 2026 8:32 AM | Updated on Mar 30 2026 8:32 AM

ఉరవకొండ: డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగానే రాజధానికి చట్టబద్ధత పేరుతో చంద్రబాబు కొత్త నాటకానికి తెరలేపారని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలన్నీ పక్కదారి పట్టించేలా చట్టబద్ధత పేరుతో చట్టవిరుద్ధ తీర్మానం చేయడం అన్ని వర్గాలనూ మోసగించడమే అవుతుందన్నారు. ఆదివారం ఉరవకొండలోని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కార్యాలయంలో అమరావతికి చట్టబద్ధత కోసం అసెంబ్లీలో నిర్వహించిన చర్చపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చర్చను తప్పుదోవ పట్టించారన్నారు. నిజమైన చర్చ రాజధాని పేరుతో జరిగిన అవినీతి, అక్రమాలపై చర్చ చేయాలన్నారు. 2014–2019 నాటి ఐదేళ్లు, ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలో రాజధాని ప్రాంత రైతుల్లో ఎంతమందికి ప్లాట్లు ఇచ్చారో, రాజధాని పేరుతో ఎంత అప్పులు చేశారో, ప్రధాని మోదీ అమరావతి నిర్మాణం కోసం రెండుసార్లు శంకుస్థాపన చేసినా పనులు ఎందుకు ప్రారంభం కాలేదో అన్న అంశం పై ప్రధానంగా చర్చ జరిపి ఉంటే రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలిసేవన్నారు. ఈ సమస్యల పై చర్చించకుండా మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని దూషించడానికే ఆరు గంటల సమయం కేటాయించారని, ముఖ్యంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ అధ్వర్యంలో కొంతమంది చంద్రబాబుకు భజన చేయడానికే సరిపోయిందని ఎద్దేవా చేశారు.

భూసేకరణ కోసం మరో డ్రామా..

అమరావతి పేరుతో ఇప్పటికే దోపిడీ చేసిన చంద్రబాబు ‘రాజధానికి చట్టబద్ధత’ పేరుతో డ్రామాకు తెరలేపి రెండో విడత భూసేకరణ చేపట్టేందుకు సిద్ధమయ్యారన్నారు. రాజధాని పేరుతో ఇప్పటికే రూ.50 వేల కోట్ల అప్పులు చేశారని, తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మరో రూ.6వేల కోట్లు కేటాయించారన్నారు. ఇంతవరకు అమరావతిలో వర్షాల సమయంలో నీళ్లు బయటకు కొట్టడం, ముళ్లకంపలు పెరిగినప్పుడల్లా జంగిల్‌ క్లియరెన్స్‌ చేయడం తప్ప కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. అమరావతిని సెల్ఫ్‌ ఫైనాన్స్‌ రాజధాని అని చెప్పి దాన్ని అప్పుల కుప్పగా మార్చేశారన్నారు. మొదట విడత భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటివరకు ప్లాట్లు ఇవ్వకుండా వారిని మోసం చేసి, రెండో విడతలో మరో లక్ష ఎకరాలు సేకరించి బడా పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసు నుండి తప్పించుకోవడానికి ఉన్న ఫళంగా హైదరాబాద్‌ నుంచి పారిపోయి చంద్రబాబు విజయవాడకు వచ్చారన్నారు. అయితే విభజన హామీలు ఒక్కటీ అమలు కాకుండానే రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చేశారన్నారు. కేంద్రంతో పోరాడి ప్రత్యేకహోదా, ప్రత్యేక ప్యాకేజీ లాంటివి సాధించకపోవడంతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఇప్పటికే రూ.2 లక్షల కోట్ల అప్పులు చేసి రికార్డు సృష్టించిన చంద్రబాబు ఈ భారమంతా ప్రజల నెత్తిపై మోపడానికి సిద్ధమయ్యారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, ఎంపీపీ, వైస్‌ ఎంపీపీలు నరసింహులు, నాయకులు ఈడిగ ప్రసాద్‌, మండల సమన్వయకర్త ఓబన్న, ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి ఏసీ ఎర్రిస్వామి, రాష్ట్ర నాయకులు బసవరాజు, నాయకులు ఎర్రిస్వామి, ఎంపీటీసీ ఈశ్వర్‌, వేమన్న, మహానంది, పట్టణ నాయకులు ఆరె రాజా, విక్కీ తదితరులు పాల్గొన్నారు.

అమరావతి నిర్మాణం అంటూ

ఇప్పటికే రూ.50వేల కోట్ల అప్పులు

ఆరు గంటల చర్చలో జగన్‌ను

తిట్టడానికి, చంద్రబాబు భజన

చేయడానికే సరిపోయింది

వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు

వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement