నర్సరీల నిర్వహణలో ప్రమాణాలు లేవు. పర్యవేక్షించే తీరిక ఉద్యాన అధికారులకు లేదు. ఇంకేముంది నర్సరీ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా నాసిరకం నార్లు–మొక్కలను రైతులకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. పంట దిగుబడులపై ప్రభావం.. పెట్టుబడుల వ్యయం పెరిగిపోవడంతో రైతులు నష్టపోతున్నారు.
అనంతపురం అగ్రికల్చర్: నర్సరీల్లో పెంచే కల్తీ నార్లను గుర్తించలేక తీసుకెళ్లి సాగు చేసి రైతులు నష్టాలపాలవుతున్నారు. జిల్లాలో 450 నుంచి 500 వరకు ఉన్న ఉద్యాన నర్సరీల ద్వారా వైరస్ ఉన్న పండ్ల మొక్కలు, నాసిరకం కూరగాయ పంటల నార్లపై ఫిర్యాదులు వస్తున్నాయి. పంట కాలంలో చీడపీడల బెడద ఎక్కువై పెట్టుబడుల ఖర్చు భారీగా పెరగడంతో పాటు దిగుబడులపై ప్రభావం చూపిస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. నర్సరీ చట్టంలో ఉన్న లొసుగులను అసరా చేసుకుని నిర్వాహకులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నా ఉద్యాన శాఖ నియంత్రించలేక పోతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నార్లకు డిమాండ్
సంప్రదాయ వేరుశనగ, ఇతర వ్యవసాయ పంటల సాగు తగ్గించిన రైతులు గత కొన్నేళ్లుగా అంతో ఇంతో ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకుంటూ రకరకాల కూరగాయ పంటలు, కర్భూజా, కళింగర, బొప్పాయి, ఇతర పండ్లతోటలు సాగు చేస్తున్నారు. నార్ల కోసం చాలావరకు నర్సరీలపై ఆధారపడుతున్నారు. దీంతో నార్లకు భారీగా డిమాండ్ ఏర్పడుతోంది. ఈ క్రమంలో చాలామంది నర్సరీ నిర్వాహకులు నిబంధనలు పక్కనపెట్టి ఇష్టారాజ్యంగా నార్లు పెంచుతూ వాటినే రైతులకు అంటగడుతున్నారు. నమ్మకంతో వాటిని తీసుకెళ్లి సాగు చేస్తే.. పంటలు తెగుళ్లబారిన పడుతున్నాయి. టమాట, మిరప కల్తీ నారు కారణంగా పంటకు తెగుళ్లబెడద ఎక్కువగా ఉంటోందని రైతులు చెబుతున్నారు.
చీనీ మొక్కల్లో వైరస్ గుర్తింపు
నర్సరీ యాక్ట్ ఉన్నట్లు ఉద్యానశాఖ చెబుతున్నా అమలు చేయడానికి వెనకాడుతోంది వాటి అనుమతులు, రిజిస్ట్రేషన్లు, పర్యవేక్షణపై ఉద్యానశాఖ దృష్టి సారించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నర్సరీలు లైసెన్సులు రెన్యూవల్ చేసుకోవడం లేదని చెబుతున్నారు. మూడు నెలలకోసారి ఉద్యానశాఖ తనిఖీలు కూడా చేయాల్సి ఉంటుంది. కూరగాయల నర్సరీల్లో మదర్‌బ్లాక్ తప్పనిసరిగా ఉండాల్సి ఉన్నా ఎక్కడా పాటించడం లేదని చెబుతున్నారు. ఇటీవల కాలంలో అక్కడక్కడా కూరగాయల మొక్కలు నాటుకుని దిగుబడులు లేక చీడపీడల బెడదతో భారీగా నష్టపోయినట్లు రైతుల నుంచి ఫిర్యాదులు కూడా అందాయి. దీంతో చాలావరకు కూరగాయల నర్సరీల్లో కల్తీ విత్తనాల నుంచి పెంచిన నాసిరకం నారు పెంచుతున్నట్లు ఆ శాఖ వర్గాలు గుర్తించాయి. గతేడాది జిల్లాకు వచ్చిన శాస్త్రవేత్తల బృందం చీనీ తోటల్లో అధ్యయనం చేసింది. జిల్లా నుంచి 50 వరకు నమూనాలు (శాంపిల్స్)ను తిరుపతిలో ఉన్న చీనీ, నిమ్మ పరిశోధనా కేంద్రానికి పంపించారు. అందులో 20 వరకు నమూనాల్లో చిన్న మొక్కల్లోనే వైరస్ ఉన్నట్లు వెల్లడైనా.. చర్యలు తీసుకునేందుకు ఉద్యానశాఖ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. వైరస్ వ్యాపించడం వల్ల చీనీ తోటల మనుగడపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా నర్సరీలకు సంబంధించి లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు, రెన్యూవల్స్, లేబులింగ్, మదర్‌బ్లాక్, నారుమడి పెంపకం పద్ధతులు, వాడుతున్న కంపెనీ విత్తనాలు, రైతులకు ఇస్తున్న రసీదు, రైతు పూర్తి వివరాలు, ఇతరత్రా రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించి నర్సరీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఉద్యానశాఖ అధికారులను రైతులు కోరుతున్నారు.
గార్లదిన్నె మండలంలో నర్సరీని పరిశీలిస్తున్న ఉద్యానశాఖ ఏడీ దేవానందకుమార్ (ఫైల్)
విడపనక ల్లు సమీపంలో తెగుళ్లు ఆశించిన మిరపను పరిశీలిస్తున్న ఉద్యానశాఖ డీడీ ఉమాదేవి (ఫైల్)
కన్నెత్తి చూడని ఉద్యాన శాఖ
గతేడాది చీనీ నర్సరీల్లో సేకరించిన శాంపిల్స్ చాలావరకు ఫెయిల్
టమాట, మిరపలో కల్తీనారు వల్ల తెగుళ్ల బెడదతో రైతులకు నష్టాలు
వైరస్ వ్యాపించడంతో చీనీ తోటల మనుగడపై శాస్త్రవేత్తల ఆందోళన


