చుక్కలు చూపిస్తున్నారు! | - | Sakshi
Sakshi News home page

చుక్కలు చూపిస్తున్నారు!

Mar 28 2026 7:36 AM | Updated on Mar 28 2026 7:36 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: రెవెన్యూ పరిపాలనలో కీలకమైన ఆర్డీఓ కార్యాలయంలో సేవలు మృగ్యంగా మారాయి. ముఖ్యంగా నిషేధిత జాబితాలో ఉన్న 22ఏ, చుక్కల భూముల ఫైళ్ల విషయంలో బాధితులకు ‘చుక్కలు’ చూపిస్తున్నారు. 22–ఏ స్టాంప్స్‌, రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌ ప్రకారం అసైన్డ్‌ భూములను నిషేధిత జాబితాలో ఉంచారు. అసైన్డ్‌ భూములు క్రయవిక్రయాలు చేయకూడదు. అయితే 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రత్యేక జీఓ తెచ్చింది. 1954కు ముందు అసైన్డ్‌ చేసిన భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి, వాటిని క్రయ విక్రయాలు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ క్రమంలో చాలామంది అర్హులుగా ఉన్న రైతులు నిషేధిత జాబితా నుంచి తమ భూములు తొలగింపునకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇందుకోసం వీఆర్‌ఓలు చాలా రికార్డులు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. తహసీల్దార్ల ఆమోదాలతో ఆర్డీఓ కార్యాలయానికి పంపుతారు. వారు పరిశీలించి కలెక్టరేట్‌కు సిఫార్సు చేస్తే డీఆర్‌ఓ, జేసీ చివరకు కలెక్టర్‌ ఆమోదముద్ర వేస్తారు. దీంతో నిషేధిత జాబితా నుంచి భూములకు విముక్తి కలుగుతుంది. అయితే ఇక్కడ దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించడం లేదనే నానుడి ఆర్డీఓ కార్యాలయం అధికారులకు సరిగ్గా సరిపోతుంది. కలెక్టర్‌ ఆనంద్‌ ప్రత్యేక చొరవ తీసుకుని జిల్లా వ్యాప్తంగా తహసీల్లార్లతో సమావేశాలు ఏర్పాటు చేసి అర్హులైన రైతుల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తుంటే అనంతపురం అర్డీఓ కార్యాలయంలో మాత్రం అడుగడుగునా కొర్రీలు వేస్తున్నారు.

గేటు దాటని ఫైళ్లు

అర్హత కల్గిన చాలా ఫైళ్లు అనంతపురం ఆర్డీఓ కార్యాలయం గేటు దాటడం లేదని రైతులు, తహసీల్దార్లు, వీఆర్‌ఓలు బాహాటంగానే చెబుతున్నారు. అక్కడ ఓ కీలక అధికారి ప్రతి ఫైలుకూ కొర్రీలు వేస్తున్నారని వాపోతున్నారు. గ్రామస్థాయి వీఆర్‌ఓలు, ఆర్‌ఐలు, సర్వేయర్లు, డీటీలు, తహసీల్దార్లు తమ విధులు నిర్వర్తించి పంపిన ఫైళ్లు కూడా ‘డిస్కషన్‌’ పేరుతో వారాల తరబడి పెండింగ్‌లో ఉండటం బాధితులను తీవ్రంగా నిరాశకు గురిచేస్తోంది. ‘సార్‌ చెప్పాడు..మీ తహసీల్దారును వచ్చి కలవమనండి. లేదంటే బాధిత రైతును వచ్చి కలవమనండి’ అంటూ వీఆర్‌ఓలతో చెబుతున్నట్లు తెలిసింది. డివిజన్‌ పరిధిలోని అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. భూముల విలువ రూ.కోట్లకు చేరడంతో ఆర్డీఓ కార్యాలయంలో కొందరి అధికారులకు అంతేస్థాయిలో ‘ఆశ’ పుడుతోంది. ‘ఉచితంగా వచ్చిన భూములు రూ. కోట్లు విలువ అవుతున్నాయి. రూ.లక్షలు ఖర్చు పెట్టుకోలేరా?’ అంటూ ఓ అధికారి మాట్లాడుతున్నారంటే ఏ స్థాయిలో బరి తెగించారో అర్థం చేసుకోవచ్చని రైతులు వాపోతున్నారు.

కోర్డు ఆదేశించినా... బ్రేక్‌

డివిజన్‌లోని ఓ బాధిత రైతు ఇటీవల హైకోర్టును ఆశ్రయించాడు. ‘మేము పూర్తిస్తాయిలో వాదోపవాదనలు విన్నామని బాధిత రైతు భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు పూర్తిగా అర్హత ఉంది’ అని హైకోర్టు స్పష్టంగా ఉత్తర్వు ఇచ్చినా ఆర్డీఓ కార్యాలయంలో ఓ అధికారి బ్రేక్‌ వేశాడంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చివరకు డీఆర్‌ఓ చొరవ తీసుకుని ఈ ఫైలును క్లియర్‌ చేయించినట్లు తెలిసింది.

కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధం

ఆర్డీఓ కార్యాలయంలో సదరు అధికారి వ్యవహారంపై కొందరు వీఆర్‌ఓలు నేరుగా కలెక్టర్‌ ఆనంద్‌ను కలిసి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని వారి తహసీల్దార్లకు ఖరాకండిగా చెప్పినట్లు తెలిసింది. తామంతా కష్టపడి ఫైళ్లను సిద్ధం చేసుకుని తీసుకెళ్తే.. రోజుకు మూడుపూటలా తిప్పుకుంటూ ముప్పుతిప్పలు పెడుతున్నారని ఇదే విషయాన్ని కలెక్టర్‌కు చెబుతామని చెప్పినట్లు తెలిసింది.

అనంతపురం ఆర్డీఓ కార్యాలయంలో అన్నీ కొర్రీలే

నిషేధిత జాబితా నుంచి తొలగని భూములు

ఆమోదిత ఫైళ్లకూ ‘డిస్కషన్‌’ పేరుతో బ్రేక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement