పుట్టపర్తి అర్బన్: పుట్టపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్ట మసకబారుతోంది. చంద్రబాబు ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టి రెండేళ్లు పూర్తి కాకముందే పలు గ్రామాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు.
అన్నీ తానై వ్యవహరిస్తున్న పల్లె రఘునాథరెడ్డి..
పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి తొలిసారి ఎమ్మెల్యే కావడం, ఆమెకు అండగా ఉన్న ఆమె మామ పల్లె రఘునాథరెడ్డి ఎమ్మెల్యేను పక్కనపెట్టి అన్ని తానై నడిపిస్తుండటంతో ఎమ్మెల్యేతో పాటు కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. సాధారణ సమావేశాలతో పాటు అధికారిక సమావేశాల్లోనూ పల్లె రఘునాథరెడ్డి పాల్గొని హల్‌చల్ చేస్తుండడం చాలా మందికి మింగుడు పడడం లేదు. ఈ వ్యవహారం ప్రభుత్వ పెద్దలకు సైతం ఇబ్బందిగా మారిందని విశ్వసనీయ సమాచారం. పార్టీలో ఒకరిద్దరు నాయకులు తప్ప ఎవరికీ ఆదాయ మార్గాలు లేక పోవడంతో చాలా మంది సీనియర్ నాయకులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారంటున్నారు.
వైఎస్సార్‌సీపీ, బీజేపీల్లోకి చేరికలు
టీడీపీలో ఇమడలేని చాలా మంది నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ, బీజేపీల్లో చేరుతున్నారు. వారంతా స్వచ్ఛందంగా పార్టీ మారడానికి ముందుకు వస్తున్నారు. ఇటీవల పుట్టపర్తి మున్సిపాలిటీలో వార్డు ఇన్‌చార్జ్ ఆవుల సుబ్రహ్మణ్యంకు విలువ ఇవ్వకపోవడంతో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు ఆయన అనుచరులు కూడా కాషాయ కండువా కప్పుకున్నారు.
● పుట్టపర్తి మండలం పెడపల్లి పంచాయతీలోని సుబ్బరాయనిపల్లి, గువ్వలగుట్టపల్లి, బత్తలపల్లి గ్రామాల్లో సుమారు 250 కుటుంబాలు ఇటీవల వరుసగా టీడీపీ నుంచి బీజేపీలో చేరాయి. ఆయా గ్రామాల్లో టీడీపీ నాయకులు ఆధిపత్యం చెలాయించడం...పల్లె రఘునాథరెడ్డి వారికే మద్దతుగా నిలవడంతో చాలా మంది కార్యకర్తలు టీడీపీకి గుడ్ బై చెబుతున్నారు.
● రెండు రోజుల క్రితం నల్లమాడ మండలం దొన్నికోట పంచాయతీలోని సుబ్బరాయనపల్లిలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీ కండువ కప్పుకున్నారు. టీడీపీలో జీవితాంతం ఉన్నా విలువ లేదని, పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్ధి వైఎస్సార్‌సీపీతోనే సాధ్యమని పేర్కొన్నారు. మరోసారి శ్రీధర్‌రెడ్డిని ఎమ్మెల్యేగా, వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు కృషి చేస్తామన్నారు.
ఖాళీగా ‘పుడా’ చైర్మన్ పదవి
నామినేటెడ్ పదవుల్లో ముఖ్యమైనది పుట్టపర్తి అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (పుడా) చైర్మన్. దీన్ని రెండేళ్ల పాటు ఎప్పుడూ ఖాళీగా ఉంచలేదు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి రెండేళ్లవుతున్నా ‘పుడా’ చైర్మన్ పదవిని ఎవరికీ కట్టబెట్టలేదు. పుడా చైర్మన్‌గా పల్లె రఘునాథరెడ్డి కూర్చుంటారని, అందుకే ఇంత కాలయాపన చేస్తున్నారనే వార్త చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ చైర్మన్ పదవిని లాక్కోవాలని చూసినా... అది కుదరక భంగపడ్డారని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే... అసలు పుట్టపర్తి నియోజకవర్గంలో చెప్పుకోదగిన అభివృద్ధి పని ఒక్కటీ చేయలేదని అన్ని వర్గాల ప్రజలు చెబుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సైతం అందరికీ అందకపోవడంతో ప్రభుత్వంపై గుర్రుమంటున్నారు.
ఎన్నికల సమయంలో పుట్టపర్తికి రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తామని, బుక్కపట్నం చెరువు ముంపు రైతులకు పరిహారం ఇప్పిస్తామని టీడీపీ నేతలు గొప్పలు చెప్పారు. అలాగే ఇంటర్, డిగ్రీ కాలేజీలు తీసుకొస్తామని, శత జయంతి ఉత్సవాలకు సత్యసాయి బాబా విగ్రహాన్ని చిత్రావతిలో ఏర్పాటు చేస్తామని ప్రగల్భాలు పలికారు. రూ.వంద కోట్లతో ఇంటింటికీ తాగునీరు సరఫరా, టిడ్కో ఇళ్లు పంపిణీ, పేదలందరికీ పక్కా ఇళ్లు, 50 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పింఛన్లు అందిస్తామని చెప్పినా ఆ హామీలన్నీ నీటి మీద రాతలుగానే మారాయి.
‘పల్లె’ పల్లెనా అసమ్మతి
ఎమ్మెల్యేను డమ్మీ చేసిన
మాజీ మంత్రి పల్లె
అన్నీ తానై చక్రం తిప్పుతున్న వైనం
తీవ్ర అసంతృప్తిలో టీడీపీ క్యాడర్
పార్టీని వీడేందుకు సిద్ధమైన
నాయకులు, కార్యకర్తలు


