● ధరల భారీ పతనమే కారణం
రాయదుర్గంటౌన్: టమాట ధరలు మరోమారు రైతులను నట్టేట ముంచాయి. పెట్టుబడి కూడా గిట్టక కన్నీరు పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం 12 కేజీల టమాట బాక్స్ ధర రూ.30, అలాగే 24 కేజీల బాక్స్ ధర రూ.100 మాత్రమే పలుకుతోంది. నాలుగైదు నెలల క్రితం బాక్స్ ధర రూ.800 నుంచి రూ.1000 పలకగా ప్రస్తుతం దారుణంగా పడిపోయింది. కనీసం బాక్స్ ధర రూ.400 పలికినా గిట్టుబాటు అయ్యేదని రైతులు వాపోతున్నారు. మార్కెట్‌కు తీసుకెళ్లేందుకు అయ్యే ఖర్చులు కూడా రాకపోవడంతో పంటను తోటలోనే వదిలేస్తున్నారు.
కన్నీరే మిగుల్చుతోంది
పంట వేసే ముందు లాభాలు వస్తాయని ఆశించడం, తీరా పంట చేతికొచ్చాక మార్కెట్లో మద్దతు ధర లేక విలవిలాడిపోవడం పరిపాటిగా మారిందని రైతులు తెలిపారు. రాయదుర్గం అర్బన్, రూరల్ పరిధిలో దాదాపు 200 ఎకరాలకు పైగా టమాట పంట సాగైంది. పంట చేతికొచ్చినా ఎటువంటి ప్రయోజనమూ లేదని వాపోతున్నారు. ఎకరా సాగుకు అన్ని రకాల ఖర్చులు, కూలీలు, మందుల ధరలు కలిపితే రూ.80 వేల నుంచి రూ.లక్ష దాకా వెచ్చించారు. మార్కెట్‌లో ప్రస్తుత ధర కనీసం టమాట రవాణాకు కూడా సరిపోవడం లేదు. పెట్టుబడుల కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదని రైతులు వాపోతున్నారు. స్థానికంగాను, ఇతర సరిహద్దు రాష్ట్రాల్లోనూ టమాట ఉత్పత్తి అధికం కావడం, ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం కారణంగా ఎగుమతి నిలిచిపోవడం లాంటి కారణాలతో ధర ఆమాంతం పతనమైనట్లు చెబుతున్నారు.


