హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్‌

Mar 28 2026 7:36 AM | Updated on Mar 28 2026 7:36 AM

అనంతపురం సెంట్రల్‌: పాత కక్షల నేపథ్యంలో యువకుడిని హతమార్చేందుకు ప్రయత్నించిన ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్లు అనంతపురం వన్‌టౌన్‌ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం వన్‌టౌన్‌ పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. పట్టుబడిన వారిలో పాతూరులోని ఆసార్‌ స్ట్రీట్‌కు చెందిన కటిక మహమ్మద్‌ సాధు, మున్నా నగర్‌ నివాసి షేక్‌ షౌకత్‌ ఆలీ, మూడో రోడ్డుకు చెందిన కట్టుబడి జహీర్‌బాషా ఉన్నారు. వీరు ఇటీవల పాతూరులోని ఎన్టీఆర్‌ మార్గ్‌ వద్ద ఆకుల శ్రీనివాసులుపై ఇనుపరాడ్లతో దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం నిందితులను అరెస్ట్‌ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.

పిచ్చికుక్క దాడిలో 8 మందికి గాయాలు

బ్రహ్మసముద్రం : భైరసముద్రం గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఓ పిచ్చి కుక్క స్వైరవిహారం చేసింది. కనిపించిన వారిపై దాడి చేయడంతో ఎనిమిది మంది గాయపడ్డారు. వీరిని 108 అంబులెన్సులో బ్రహ్మసముద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి

సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ

శింగనమల(నార్పల): మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్‌ చేశారు. నార్పల మండలం బండ్లపల్లిలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కమ్యూనిస్టుల పోరాటాల ఫలితంగా అమలులోకి వచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రద్దు చేసి కూలీల పొట్ట కొడుతోందని మండిపడ్డారు. ఏటా బడ్జెట్‌లో నిధులు తగ్గిస్తూ చట్టాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. తాజాగా ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి, వీజీ రామ్‌జీ పేరుతో కొత్త పథకాన్ని తీసుకువచ్చి రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పెంచిందన్నారు. దీంతో కేంద్ర నిర్ణయం మేరకు 40 శాతం నిధులను కేటాయించలేక రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేస్తున్నాయన్నారు. దీంతో ఉపాధి చట్టాన్ని కాపాడుకునేందుకు ఏప్రిల్‌ 10, 11, 12 తేదీల్లో అనంతపురం నుంచి బండ్లపల్లి వరకూ పాదయాత్ర చేపట్టి బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీష్‌, జిల్లా కార్యదర్శి పాలెం నారాయణస్వామి, సహాయ కార్యదర్శులు మల్లికార్జున, రాజారెడ్డి, నియోజకవర్గ కార్యదర్శి తలారి నారాయణస్వామి, జిల్లా కార్యవర్గ సభ్యులు రాజేష్‌ గౌడు, మండల కార్యదర్శి గంగాధర, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి కేశవరెడ్డి, నాయకులు పెద్దయ్య, బండి రామకష్ణ, బండారు రామాంజినేయులు, చేపల రామాంజి, పెద్ద పెద్దయ్య, రాము పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement