28 గ్యాస్‌ సిలిండర్ల సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

28 గ్యాస్‌ సిలిండర్ల సీజ్‌

Mar 26 2026 7:42 AM | Updated on Mar 26 2026 7:42 AM

గుత్తి: వంట గ్యాస్‌ అక్రమ వినియోగం నిరోధానికి గుత్తి రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తహసీల్దార్‌ పుణ్యవతి, డీటీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో రెండు బృందాలుగా విడిపోయిన అధికారులు బుధవారం గుత్తితో పాటు ఆర్‌ఎస్‌ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా హోటళ్లలో వాడుతున్న 28 గృహ వినియోగ వంట గ్యాస్‌ సిలిండర్లను గుర్తించి స్వాధీనం చేసుకుని, నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. కాగా, తనిఖీల సమాచారంతో గుత్తితో పాటు ఆర్‌ఎస్‌ ప్రాంతాల్లోని హోటళ్ల నిర్వాహకులు అప్రమత్తమయ్యారు. వెంటనే హోటళ్లను బంద్‌ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో గుత్తి, ఆర్‌ఎస్‌ ప్రాంతాల్లోని 80 శాతం హోటళ్లు మూతపడడంతో కనీసం భోజనం, టీ, కాఫీలకు సైతం ప్రజలు ఇబ్బంది పడ్డారు.

పామిడి: నిబంధనలకు విరుద్ధంగా పామిడిలోని చికెన్‌ సెంటర్లలో వినియోగిస్తున్న గృహ వినియోగ వంట గ్యాస్‌ సిలిండర్లను తహసీల్దార్‌ సి.షర్మిల బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 5 భారత్‌, 17 ఇండియన్‌ గ్యాస్‌ సిలిండర్లు ఉన్నాయి. తనిఖీల్లో తహసీల్దార్‌ వెంట వీఆర్వోలు గోపాలరెడ్డి, ఎర్రినాగప్ప, భాగ్య, జ్యోత్స్న పాల్గొన్నారు.

వజ్రకరూరు: నిబంధనలకు విరుద్ధంగా వజ్రకరూరు, కొనకొండ్ల గ్రామాల్లోని టీస్టాల్స్‌, ఫాస్ట్‌పుడ్‌ సెంటర్లు, హోటళ్లలో వినియోగిస్తున్న 11 గృహ వినియోగ గ్యాస్‌ సిలిండర్లను వజ్రకరూరు తహసీల్దార్‌ నరేష్‌కుమార్‌ బుధవారం సీజ్‌ చేశారు. వీటిని వజ్రకరూరులోని ఇండేన్‌ గ్యాస్‌ ఏజెన్సీకి తరలించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ సతీష్‌, వీఆర్వోలు భరత్‌కుమార్‌, మారెన్న, ఆదినారాయణ, ఛత్రునాయక్‌ పాల్గొన్నారు.

400 మంది విద్యార్థుల గైర్హాజరు

అనంతపురం ఎడ్యుకేషన్‌: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో భాగంగా బుధవారం నిర్వహించిన భౌతికశాస్త్రం పరీక్షకు 400 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 143 సెంటర్లలో జరిగిన ఈ పరీక్షకు రెగ్యులర్‌, ప్రైవేట్‌ విద్యార్థులు 32,485 మందికి గాను 32,085 మంది హాజరయ్యారు. జిల్లా పరిశీలకులు సుబ్బారావు ఆరు, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌ వెంకటేష్‌ ఏడు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు 47 కేంద్రాలను తనిఖీలు చేశారు. అలాగే ఏపీ ఓపెన్‌ స్కూల్‌ పదో తరగతి పరీక్షల్లో భాగంగా బుధవారం జరిగిన సోషల్‌ పరీక్షకు జిల్లాలో 785 మంది విద్యార్థులకు గాను 620 మంది హాజరయ్యారు. 165 మంది గైర్హాజరయ్యారు.

రైతు సేవలకు ప్రాధాన్యత

అనంతపురం అగ్రికల్చర్‌: రైతు సేవలకు ప్రాధాన్యతనిస్తూనే జిల్లా సహకార మార్కెటింగ్‌ సంఘాన్ని ఆర్థికంగా అభివృద్ధి పథంలో నడిపించనున్నట్లు డీసీఎంఎస్‌ చైర్మన్‌ నెట్టెం వెంకటేశులు పేర్కొన్నారు. బుధవారం అనంతపురంలోని డీసీఎంఎస్‌ ప్రాంగణంలో బిజినెస్‌ మేనేజర్‌ సత్యనారాయణరెడ్డి అధ్యక్షతన వార్షిక మహాజనసభ జరిగింది. గతేడాది రూ.24.71 కోట్ల టర్నోవర్‌తో రూ.4.24 లక్షల నికరలాభం వచ్చిందన్నారు. ప్రస్తుత 2025–26 ఏడాది జనవరి నెలాఖరు నాటికే రూ.22.92 కోట్ల మేర టర్నోవర్‌ సాధించినట్లు వివరించారు. అనంతపురంతో పాటు తాడిపత్రి, పెనుకొండ, కదిరి, హిందూపురం, కళ్యాణదుర్గం, ధర్మవరం కేంద్రాల ద్వారా మున్ముందు మరింత ఆర్థిక పురోగతి కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో జిల్లా సహకార అధికారి (డీసీఓ) అరుణకుమారి, డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ జయచంద్రనాయుడు, అకౌంట్స్‌ మేనేజర్‌ సుధాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గంజాయి విక్రేత అరెస్ట్‌

గుంతకల్లు: స్థానిక హనుమన్‌ సర్కిల్‌లో గంజాయి విక్రయిస్తున్న భాగ్యనగర్‌కు చెందిన షికారీ సోమిని అరెస్ట్‌ చేసినట్లు ఎకై ్సజ్‌ సీఐ జి.శివసాగర్‌ తెలిపారు. అందిన సమాచారం మేరకు బుధవారం ఉదయం తనిఖీలు చేపట్టిన సమయంలో గంజాయి విక్రయిస్తూ సోమి పట్టుబడ్డాడన్నారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి 515 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై దాడి

నిందితుడి అరెస్ట్‌

అనంతపురం సెంట్రల్‌: నగరంలో మంగళవారం రాత్రి ట్రాఫిక్‌ పోలీసులతో ఓ వ్యక్తి దురుసుగా వ్యవహరించాడు. అంతటితో ఆగకుండా ట్రాఫిక్‌ హెడ్‌కానిస్టేబుల్‌ హనుమాన్‌ను కిందకు తోసేసి తీవ్రంగా గాయపరిచాడు. వివరాలను బుధవారం వన్‌టౌన్‌ సీఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు. నగరంలోని శ్రీకంఠం సర్కిల్‌లో మంగళవారం రాత్రి ట్రాఫిక్‌ ఎస్‌ఐ రామాంజులరెడ్డి ఆధ్వర్యంలో హెడ్‌కానిస్టేబుల్‌ హనుమాన్‌ తదితరులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో రాణినగర్‌కు చెందిన షేక్‌ టోపీవలీ స్కూటీపై అటుగా రావడంతో ఆపి బ్రీత్‌ అనలైజర్‌ ద్వారా పరీక్ష చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో పోలీసులకు సహకరించకుండా దురుసుగా ప్రవర్తిస్తూ బూతులు మాట్లాడుతూ రెచ్చిపోయాడు. హనుమాన్‌ను కిందకు తోసేయడంతో తలకు తీవ్ర రక్తగాయమైంది. అనంతరం నిందితుడు ద్విచక్రవాహనంతో ఉడాయించాడు. ఘటనపై ట్రాఫిక్‌ ఎస్‌ఐ రామాంజులరెడ్డి ఫిర్యాదు మేరకు వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి, బుధవారం నిందితుడిని అరెస్ట్‌ చేసి న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. నిందితుడిపై రౌడీషీట్‌ తెరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement