అనంతపురం ఎడ్యుకేషన్: ప్రస్తుత ఉపాధ్యాయ బదిలీల్లో రేషనలైజేషన్ మినహాయింపు ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (అపస్) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం డీఈఓ కార్యాలయ ఏడీ శ్రీనివాసులును కలిసి వినతిపత్రం అందజేసి, మాట్లాడారు. ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాను డీఈఓ బ్లాగ్‌లో ఉంచాలన్నారు. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి ఉన్నత పాఠశాలకు పీఈటీ పోస్టును మంజూరు చేయాలన్నారు. బేసిక్ ప్రైమరీ పాఠశాలల్లో మూడో పోస్టును మంజూరు చేయాలన్నారు. ఉద్యోగ విరమణకు దగ్గరలో ఉన్న, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పదో తరగతి మూల్యంకానికి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఏడీని కలిసిన వారిలో అపస్ జిల్లా ప్రధానకార్యదర్శి ఎర్రిస్వామి, ఉపాధ్యక్షులు శివప్రసాద్‌నాయుడు, హర్షవర్దన్, వై.రామన్న, ప్రధానకార్యదర్శులు రమేష్, దాసరి వరదరాజులు ఉన్నారు.


