ఓడీచెరువు: మాదక ద్రవ్యాలను తరలిస్తూ పట్టుబడిన కేసులో ముద్దాయిలకు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ అనంతపురం 1వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి సత్యవాణి తీర్పు వెలువరించారు. వివరాలను తనకల్లు పీఎస్ ఎస్‌హెచ్‌ఓ రాంప్రసాద్ బుధవారం వెల్లడించారు. 2019లో 60 కిలోల గసగసాల చెత్తను తొమ్మిది సంచులలో నింపుకుని ఆటోలో తరలిస్తూ ఓడీచెరువు మండలం మిట్టపల్లి వద్ద రఘునాథనాయుడు, కావలి మనోహర్, పూజారి శంకరప్ప పట్టుబడ్డారన్నారు. నిందితులపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరు పరచగా... అప్పటి నుంచి ఈ కేసు వాదనలు కోర్టులో కొనసాగుతూ వచ్చాయని వివరించారు. సమగ్ర విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో ముద్దాయిలకు పదేళ్ల కఠిన కారాగారా శిక్ష, ఒక్కొక్కరికి రూ.లక్ష జరిమానా విధిస్తూ న్యాయమూర్తి సత్యవాణి బుధవారం తీర్పు వెలువరించారన్నారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేపాక్షి నాయుడు వాదనలు వినిపించినట్లు తెలిపారు.
కేంద్రం వైఖరికి నిరసనగా పాదయాత్ర
● సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ
అనంతపురం అర్బన్: ఉపాధి పథకం అమలు విషయంగా కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరికి నిరసనగా ఏప్రిల్ 10 నుంచి 12వ తేదీ వరకూ పాదయాత్ర తలపెట్టినట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. జిల్లా సీపీఐ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన పార్టీ ఉమ్మడి అనంతపురం జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన జీ రామ్ జీ పథకానికి నిధులు కేటాయింపులో మార్పుల కారణంగా కూలీలకు ఇబ్బందులు తప్పవన్నారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య నిధుల పంపిణీ నిష్పత్తిలో వచ్చిన మార్పులు క్షేత్రస్థాయిలో కూలీలకు శాపంగా మారే ప్రమాదం ఉందన్నారు. గ్రామీణ వ్యవస్థ కుప్పకూలకముందే నిధుల నిష్పత్తిని కేంద్రం పునఃసమీక్షించాలని డిమాండ్ చేస్తూ ఉపాఽధి పథకం ప్రారంభించిన బండ్లపల్లి వరకు చేపట్టిన పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీష్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్, ఉమ్మడి జిల్లాల కార్యదర్శులు నారాయణస్వామి, వేమయ్యయాదవ్, సహాయ కార్యదర్శులు మల్లికార్జున, రాజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ప్రియురాలి మోసం..
యువకుడి బలవన్మరణం
తాడిపత్రి రూరల్: ప్రియురాలు మోసం చేసిందన్న బాధలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు... వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలోని అంకంపల్లికి చెందిన నాగమల్లారెడ్డి, పద్మావతి దంపతులకు ఇరువురు కుమారులున్నారు. పెద్ద కుమారుడు శివపవన్‌కుమార్‌రెడ్డి వాటర్ బాటిళ్లను దుకాణాలకు వేస్తూ వచ్చిన కమీషన్‌ను కుటుంబ అవసరాలకు ఇచ్చేవాడు. ఈ క్రమంలో పరిచయమైన యువతితో ప్రేమలో పడ్డాడు. ఇటీవల యువతి తనను మోసం చేస్తున్నట్లుగా గుర్తించిన శివపవన్‌కుమార్‌రెడ్డి మనోవేదనకు లోనయ్యాడు. దీంతో జీవితంపై విరక్తి పెంచుకుని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో బుధవారం పులివెందుల నుంచి తాడిపత్రికి బస్సులో వచ్చి ఆర్టీసీ బస్టాండ్ నుంచి రైల్వేస్టేషన్‌కు ఆటోలో చేరుకున్నాడు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకునేందుకు పట్టాలపై నడుచుకుంటూ వెళుతుండగా తమ్ముడు శివనాగార్జునరెడ్డి ఫోన్ చేశాడు. కాల్ రిసీవ్ చేసుకున్న శివపవన్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను ఎక్కడున్నానో తనకే తెలియదని, ఇక ఇంటికి రానని, ప్రేమ విఫలం కావడంతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ తెలిపాడు. ఆందోళనకు గురైన తమ్ముడు వెంటనే సర్ది చెబుతూ ఎక్కడున్నావో లోకేషన్ షేర్ చేయాలని అడగడంతో శివపవన్‌కుమార్‌రెడ్డి ఫోన్ లోకేషన్ షేర్ చేశాడు. అప్పటికే కోమలి సమీపంలోకి చేరుకున్న శివపవన్‌కుమార్‌రెడ్డి ఎదురుగా వస్తున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కో–పైలెట్ సమాచారంతో ఘటనా స్థలానికి జీఆర్పీ హెచ్‌సీ వరప్రసాద్ చేరుకుని పరిశీలించారు. కాసేపటి తర్వాత ఫోన్ లోకేషన్ ఆధారంగా ప్రత్యేక వాహనంలో తల్లిదండ్రులతో కలసి శివనాగార్జునరెడ్డి చేరుకున్నాడు. పట్టాలపై ఛిద్రమై పడి ఉన్న కుమారుడి శరీర భాగాలు చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.


