అనంతపురం: అధికారాన్ని హస్తగతం చేసుకుని రెండేళ్లు కావస్తున్నా.. క్రైస్తవుల సంక్షేమానికి సీఎం చంద్రబాబుకు చేసింది ఏమీ లేదని వైఎస్సార్‌సీపీ క్రిస్టియన్ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జాన్‌వెస్లీ విమర్శించారు. ఆ విభాగం జిల్లా అధ్యక్షుడు వైపీ బాబు అధ్యక్షతన జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో బుధవారం క్రిస్టియన్ మైనార్టీ సెల్ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన జాన్‌వెస్లీ మాట్లాడుతూ... పాలన పట్ల పారదర్శకత కన్నా వైఎస్సార్‌సీపీ నాయకులను అణచివేయడంపైనే సీఎం చంద్రబాబు దృష్టి సారించారని మండిపడ్డారు. వైఎస్ జగన్ హయాంలో క్రైస్తవుల సంక్షేమానికి రూ.416 కోట్లు ఖర్చు చేశారన్నారు. 1.80 లక్షల మంది లబ్ధిదారులకు సంక్షేమం లభించిందని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవిత్ర జెరూసలేం పర్యటనకు ఒక్కరినీ కూడా ప్రభుత్వం తరఫున పంపించ లేదన్నారు. క్రైస్తవులపై దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. దాడులను స్వయంగా ప్రభుత్వ పెద్దలే ప్రోత్సహిస్తూ మత వైషమ్యాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. డిప్యూటీ స్పీకర్ నియోజకవర్గ పరిధిలో ఎన్నో చర్చిలు కూల్చివేశారన్నారు. 24 చర్చిల్లో ఆరాధన జరగకుండా చేశారన్నారు. నష్టపరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్నారు. కార్యక్రమంలో క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర జానీ, థామస్, రాము, జిల్లా ఉపాధ్యక్షుడు రాజ్‌కుమార్, కార్యదర్శులు ప్రభాకర్, సునీల్, అనంతపురం వింగ్ అధ్యక్షుడు సతీష్, గుంతకల్లు అధ్యక్షుడు బింగి కిరణ్, శింగనమల అధ్యక్షుడు ఆనంద్, ఉరవకొండ మోనాలిసా, జాకోబ్, సాల్మన్‌రాజ్, అబ్రహం తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ క్రిస్టియన్ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జాన్‌వెస్లీ


