అనంతపురం అర్బన్: ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల పరిధిలో మంజూరు చేసిన రుణాలకు సంబంధించి రికవరీలు పూర్తి స్థాయిలో చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఓ.ఆనంద ఆదేశించారు. సంక్షేమ శాఖల పనితీరుపై బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. దివ్యాంగ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 13,683 మంది దివ్యాంగులకు యూడీఐడీ కార్డులు మంజూరు చేయాలన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో అవసరమైన చోట మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. తాగునీటి సరఫరా విషయంలో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. ప్రధానమంత్రి జనవికాస్ పథకం కింద మైనారిటీ జనాభా ఉన్న విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అవకాశం ఉన్న చోట వసతి గృహాలు, తరగతి గదులు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. సంక్షేమ పాఠశాలలు, వసతిగృహాలు, కేజీబీవీలు, ఒకేషనల్ ఎడ్యుకేషన్ పాఠశాలల్లో వందశాతం విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ ఉండేలా చొరవ తీసుకోవాలన్నారు. ప్రతి మండలానికి రెండు చొప్పున ఉన్నత పాఠశాలల్లో స్మార్ట్ కిచెన్‌లు ఏర్పాటు చేయాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్ పరిధిలో షాపింగ్ కాంప్లెక్స్‌పై ఫిర్యాదులు వస్తున్నాయని, నిబంధనల ప్రకారం కేటాయింపులు జరగాలన్నారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ జేడీ, బీసీ సంక్షేమ డీడీ ఖుష్బూ కొఠారి, జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి రజాక్‌ఖాన్, డీటీడబ్ల్యూఓ శ్రీనివాసరావు, డీఎండబ్ల్యూఓ రామసుబ్బారెడ్డి, సమగ్ర శిక్ష ఏపీసీ శైలజ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కుముద, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ సురేష్, డీఈఓ ప్రసాద్‌బాబు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
అధికారులకు కలెక్టర్ ఆనంద్ ఆదేశం


