అనంతపురం అగ్రికల్చర్: రాష్ట్రంలో మరే జిల్లాలోనూ లేనివిధంగా ‘అనంత’లో పంటల వైవిధ్యం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దేశంలో పండే ప్రధాన పంటలన్నీ జిల్లాకు పరిచయం అవుతుండటం విశేషం. చివరకు కశ్మీర్, సిమ్లా లాంటి అతిశీతల వాతావరణంలో పండే యాపిల్ లాంటి పంట కూడా ఇక్కడి రైతులు సాగు చేస్తున్నట్లు వెల్లడి కావడం గమనార్హం. ఈ–క్రాప్ సర్వేతో జిల్లాలో పంటల వారీగా దాదాపుగా కచ్చితమైన లెక్కలు అందుబాటులోకి వస్తున్నాయి. వ్యవసాయ, ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖల పరిధిలో ఎన్ని రకాల వ్యవసాయ పంటలు, ఎన్ని రకాల పండ్లతోటలు, కూరగాయలు, ఆకుకూరలు, ఔషధ పంటలు, పూల తోటలు సాగు చేస్తున్నారనేది వెల్లడవుతోంది. దీంతో గతంలో 15 నుంచి 20 వరకు వ్యవసాయ పంటలు, 20 నుంచి 25 వరకు ఉద్యాన పంటలు.. ఇలా ఏటా ఖరీఫ్‌లో 40 నుంచి 50 పంటలు, రబీలో అయితే 20 నుంచి 25 పంటలు చూపించే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలా కాకుండా వందల సంఖ్యలో పంటలు సాగు చేస్తున్నట్లు వెల్లడవుతోంది. గత ఖరీఫ్‌లో ఏకంగా 150 రకాల పంటలు సాగు చేసినట్లు నమోదు చేశారు.
రబీలో 127 రకాల పంటలు..
ఈ రబీలో జిల్లా వ్యాప్తంగా 3,93,958 ఎకరాల్లో 127 రకాల పంటలు సాగు చేసినట్లు ఈ–క్రాప్ ద్వారా వెల్లడైంది. అయితే ఇందులో కేవలం ఏడు రకాల వ్యవసాయ పంటలే 3,47,163 ఎకరాల్లో సాగులోకి రాగా.. మిగతా 46,795 ఎకరాల్లో 100 రకాల పంటలు వేశారు. అందులో పప్పుశనగ, వరి, వేరుశనగ, సజ్జ, మినుము, ఆముదం, బేబీకార్న్, పాప్‌కార్న్, పత్తి, అలసంద, పెసర, ఉలవ, జొన్న, మొక్కజొన్న, కొర్ర, కంది, కుసుమ, నువ్వులు, సోయాబీన్, చెరకు, పొద్దుతిరుగుడు, పత్తి, పొగాకు, గోధుమ, రాగి, మల్బరీ, ఉసిరి, చీనీ, నిమ్మ, సపోట, జామ, ద్రాక్ష, దానిమ్మ, అరటి, అంజూర, మామిడి, సీతాఫలం, పనస, మకాడమియా, అజ్వాన్, అమరాంథస్, ఆకు, వక్క, ఆపిల్, ఆపిల్ బేర్, అశ్వగంధ, అవకాడో, వెదురు, టమాట, వంగ, బెండ, బీన్స్, బీట్‌రూట్, బ్రాడ్‌బీన్స్, గుమ్మడి, కాకర, సొర, బీర, బూడిద గుమ్మడి, క్యాబేజ్, క్యాప్సికం, బెర్రీ, రేగు, క్యారెట్, కాలీఫ్లవర్, లిల్లీ, మల్లె, రోజ్, ట్యూబ్‌రోజ్, కనకాంబరం, చామంతి, బంతి, కొబ్బరి, ధనియాలు, కరివేపాకు, దోస, కర్భూజ, కళింగర, బొప్పాయి, కస్టర్డ్ యాపిల్, ఖర్జూరం, డ్రాగన్, మునగ, ఫీల్డ్‌బీన్, ఫ్లాక్స్ సీడ్, గోంగూర, పచ్చిమిరప, ఎండుమిరప, ఉల్లి, పొటాటో, స్వీట్ పొటాటో, ముల్లంగి, రాజ్మాబీన్, ఎర్రచందనం, శీకాకాయి, పసుపుతో పాటు మరికొన్ని కూరగాయలు, ఆకుకూరలు, ఔషధ పంటలు.. మొత్తంగా 127 రకాలు సాగైనట్లు ఈ–క్రాప్‌లో నమోదు చేశారు.
రబీలో 3,93,958 ఎకరాల విస్తీర్ణంలో
127 రకాల పంటలు సాగు
గత ఖరీఫ్‌లోనూ ఏకంగా 150 రకాల పంటలు సాగైనట్లు ఈ–క్రాప్‌లో వెల్లడి
సత్ఫలితాలిస్తున్న ఈ–క్రాప్
కచ్చితమైన సాగు గణాంకాలు తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం తరఫున అర్హులైన రైతులకు అందాల్సిన ప్రయోజనాలు కల్పించడానికి వీలుగా గతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు తీసుకువచ్చిన ఈ–క్రాప్ (పంట నమోదు) ప్రక్రియ మంచి ఫలితాలను ఇస్తోంది. ఈ –క్రాప్ (డిజిటల్ క్రాప్ సర్వే) లేనప్పుడు అధికారులు, ఆయా శాఖల సిబ్బంది ఇచ్చిన కాకిలెక్కలే అన్నింటికీ ప్రామాణికంగా తీసుకునే పరిస్థితి ఉండేది. అయితే 2019లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కొలువుతీరాక వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఆర్‌బీకే వ్యవస్థతో గ్రామ స్థాయిలో వ్యవసాయ, అనుబంధ రంగాల ప్రణాళికలు అమలు చేయడంతో రైతులకు అన్ని రకాలుగా వెసులుబాటు లభించింది. ఈ క్రమంలో ఈ–క్రాప్‌కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రభుత్వం నుంచి నేరుగా లబ్ధి చేకూరి రైతులకు ఉపశమనం లభించింది.


