● క్విజ్ పోటీల్లో విజేతగా
సర్పంచ్ హనుమంతరెడ్డి
కూడేరు: జాతీయ స్థాయిలో కూడేరు మండల పరిధిలోని పి.నారాయణపురం పంచాయతీకి గుర్తింపు దక్కింది. వివరాల్లోకి వెళితే... ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకొని వారం రోజులుగా కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ‘సర్పంచ్ సంవాద్’ యాప్ ద్వారా సర్పంచులకు క్విజ్ పోటీలు నిర్వహించింది. పి.నారాయణపురం సర్పంచ్ హనుమంతరెడ్డి నీటి సంరక్షణ, నిర్వాహణపై సరైన సమాధానాలు చెప్పారు. దీంతో కేంద్ర ప్రభుత్వం సర్పంచ్ హనుమంతరెడ్డిని విజేతగా ఆదివారం ప్రకటించింది. విజేతగా నిలిచిన హనుమంతరెడ్డికి పంచాయతీ ప్రజలు, తోటి సర్పంచులు అభినందనలు తెలిపారు.
ఏపీసీపీఎస్‌ఈఏ
జిల్లా నూతన కార్యవర్గం
అనంతపురం ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. స్థానిక ఉపాధ్యయ భవనంలో సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం కమిటీని ఎన్నుకున్నారు. ఏపీసీపీఎస్‌ఈఏ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పాలెల రామాంజనేయులు యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎన్నికల పరిశీలకులుగా రాంభూపాల్‌రెడ్డి వ్యవహరించారు. జిల్లా గౌరవాధ్యక్షుడిగా మురళీకృష్ణ, గౌరవ సలహాదారుడిగా జి.ప్రభాకర్, అధ్యక్షుడిగా పి.జగదీష్, ప్రధాన కార్యదర్శిగా ఎం.రవికుమార్, ఆర్థిక కార్యదర్శిగా కె.గోపాల్‌నాయక్, సహాధ్యక్షుడిగా వరప్రసాద్, సహ కార్యదర్శిగా శర్మాస్‌సాబ్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా వి.అర్చన, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా వి.కళ్యాణ్, వై.రామన్న, లక్ష్మణ్, కె.నాగరాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.


