అనంతపురం ఎడ్యుకేషన్: ‘వడ్డించేవాడు మనోడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా పరవాలేదు’ అనే నానుడి ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి (ఆర్‌ఐఓ)గా పని చేస్తున్న వెంకటరమణనాయక్‌కు సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ప్రిన్సిపాల్‌గా అత్యంత జూనియర్‌గా ఉన్న ఆయనను నిబంధనలకు విరుద్ధంగా ఆర్‌ఐఓగా కొనసాగిస్తుండమే ఇందుకు నిదర్శనం. ఈ వ్యవహారం ఆర్‌ఐఓ, డీవీఈఓ కార్యాలయాలతో పాటు జిల్లా వ్యాప్తంగా జూనియర్ అధ్యాపకుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రెగ్యులర్ డీవీఈఓ వచ్చినా....
జీఓ నంబర్ 8 మేరకు హైకోర్టు ఆదేశాలతో అన్ని ఉమ్మడి జిల్లాలకు రెగ్యులర్ డీవీఈఓలను నియమించే సందర్భంలో సీనియార్టీ జాబితాలో 57, 59, 65, 66, 71, 73, 75 స్థానాల్లో ఉన్న వారిని కాదని 327వ స్థానంలో ఉన్న వెంకటరమణనాయక్‌ను డీవీఈఓ (ఎఫ్‌ఏసీ)గా కొనసాగించారు. ఇందుకు ఇంటర్ బోర్డులో పని చేస్తున్న ఓ రిటైర్డ్ అధికారి అండగా ఉంటూ కీలకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కొందరు సీనియర్లు కోర్టుకు వెళ్లడంతో 2025 జనవరి 5న ఆయనను డీవీఈఓ బాధ్యతల నుంచి తప్పించి రెగ్యులర్ డీవీఈఓగా గురువయ్యశెట్టిని నియమించారు. అదే ఏడాది జూలైలో ఆయా జిల్లాల్లో రెగ్యులర్ డీవీఈఓలకు ఆర్‌ఐఓ బాధ్యతలు అప్పగించారు. కానీ ఇక్కడ మాత్రం వెంకటరమణనాయక్‌నే ఎఫ్‌ఏసీ ఆర్‌ఐఓగా కొనసాగిస్తూ వస్తున్నారు. ఎఫ్‌ఏసీ హోదాలో మూడేళ్లు మాత్రమే ఉండొచ్చని అధ్యాపకులు చెబుతున్నారు. ఆయన మాత్రం నిబంధనలకు విరుద్ధంగా నాలుగేళ్లకు పైగా కొనసాగుతున్నారని అంటున్నారు.
● డీవీఈఓ అనుమతి లేకుండా ఉద్యోగులకు ఓడీ (ఆన్ డ్యూటీ) ఇవ్వకూడదు. 2019 మార్చి పరీక్షల సమయంలో ఒక రికార్డు అసిస్టెంట్‌కు ఆర్‌ఐఓ వెంకటరమణనాయక్ ఏకంగా 30 రోజులు ఓడీ ఇవ్వడాన్ని అధ్యాపకులు తప్పుపడుతున్నారు. ఈ విషయంపై 2021లో అప్పటి సెక్రటరీకీ కొందరు సాక్షాధారాలతో ఫిర్యాదు చేశారు. దీంతో అప్పట్లో ఈయనను ఆర్‌ఐఓ బాధ్యతల నుంచి తప్పించారని చెబుతున్నారు. అయితే కమిషనర్ మారిన వెంటనే మళ్లీ చక్రం తప్పి డీవీఈఓగా తెచ్చుకున్నారనే ఆరోపణలున్నాయి. 2024 ఏప్రిల్‌లో తిరిగి ఆర్‌ఐఓ బాధ్యతలూ చేపట్టారు.
● 2025 మార్చిలో జరిగిన పరీక్షల సమయంలో డీఈసీ మెంబరుగా నిబంధనలకు విరుద్ధంగా తనమిత్రుడికి లైబ్రేరియన్‌గా అవకాశం కల్పించారు. ఈ వ్యవహారంలో ఓ ప్రజాప్రతినిధి నేరుగా ఇంటర్ బోర్డుకు ఫిర్యాదు చేయడంతో ఈసారి డీఈసీ కమిటీలో సదరు లైబ్రేరియన్‌ను తప్పించారని చెబుతున్నారు. ఈయన హయాంలో జరిగిన , జరుగుతున్న అక్రమాలపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశిస్తే మరిన్ని వెలుగులోకి వస్తాయని అధ్యాపకులు చెబుతున్నారు.
రాష్ట్రమంతా రెగ్యులర్ డీవీఈఓలకు ఆర్‌ఐఓ బాధ్యతలు
ఇక్కడ మాత్రం ఏళ్లుగా ఎఫ్‌ఏసీ
ఆర్‌ఐఓగా వెంకటరమణనాయక్
సీనియర్లను కాదని జూనియర్‌ను
కొనసాగిస్తుండడంపై అనుమానాలు


