నేడు డయల్‌ యువర్‌ ఎస్పీడీసీఎల్‌ సీఎండీ | - | Sakshi
Sakshi News home page

నేడు డయల్‌ యువర్‌ ఎస్పీడీసీఎల్‌ సీఎండీ

Mar 23 2026 8:28 AM | Updated on Mar 23 2026 8:28 AM

అనంతపురం టౌన్‌: విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు డయల్‌ యువర్‌ ఎస్పీడీసీఎల్‌ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీఎండీ శివశంకర్‌ లోతేటి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్‌ సమస్యలున్న వినియోగదారులు సెల్‌ నంబర్‌ : 8977716661 కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయొచ్చన్నారు. ఫోన్‌ చేసే వినియోగదారులు తమ విద్యుత్‌ నంబర్‌ను తప్పకుండా తెలియజేయాలని సూచించారు.

జిల్లాలో డయల్‌ యువర్‌ ఎస్‌ఈ..

అనంతపురం జిల్లాలో డయల్‌ యువర్‌ ఎస్‌ఈ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు విద్యుత్‌శాఖ ఎస్‌ఈ శేషాద్రి శేఖర్‌ తెలిపారు. విద్యుత్‌ సమస్యలున్న వినియోగదారులు సెల్‌ నంబర్‌: 9154790350లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

హేతుబద్ధీకరణ ప్రక్రియ నిలిపేయాలి

అనంతపురం ఎడ్యుకేషన్‌: రాబోయే విద్యా సంవత్సరం (2026–27) లో ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో చాలా పాఠశాలల్లో వివిధ సబ్జెక్టులకు సంబంధించిన పోస్టులు ముఖ్యంగా ఉన్నత పాఠశాలల్లో చాలా పోస్టులు పోయే ప్రమాదం ఉందని ప్రోగ్రెస్సివ్‌ రికగ్నైజ్డ్‌ టీచర్స్‌ యూనియన్‌ (పీఆర్టీయూ) నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌.విష్ణువర్ధన్‌రెడ్డి, జి.తిమ్మారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి.చంద్రశేఖర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎ.కేశవరెడ్డి సంయుక్త ప్రకటన విడుదల చేశారు. గత విద్యా సంవత్సరం హేతుబద్ధీకరణ జరిగిందని, వెంటనే మళ్లీ హేతుబద్ధీకరణ ప్రారంభిస్తే ఉపాధ్యాయ పోస్టులు పోతాయన్నారు. ఒకవేళ ప్రభుత్వం హేతుబద్ధీకరణ ప్రక్రియను చేపట్టాలని మొండి పట్టుదలతో ముందుకెళితే, ప్రస్తుతమున్న ఉపాధ్యాయ – విద్యార్థుల నిష్పత్తిని 1:49 నుంచి 1: 40కి కుదించాలని డిమాండ్‌ చేశారు.

మటన్‌ కడ్డీ గుచ్చుకుని వ్యాపారికి గాయాలు

గుత్తి: పట్టణంలోని అమృత్‌ సినిమా థియేటర్‌ ఎదురుగా మటన్‌ షాప్‌ నిర్వాహకుడు కటిక ఖురేషి అన్వర్‌ ఆదివారం తీవ్రంగా గాయపడ్డాడు. మటన్‌ కొడుతున్న సమయంలో మటన్‌ కోసం ఏర్పాటు చేసిన కడ్డీ పొరపాటును చేతికి గుచ్చుకుంది. దీంతో రక్త స్రావం జరిగింది. స్నేహితులు డిష్‌ మహమ్మద్‌, వైఎస్సార్‌సీపీ కార్యకర్త మహమ్మద్‌ అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చేతికి కుట్లు వేసి కట్టు కట్టారు.

అగ్ని ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

గుమ్మఘట్ట: మండలంలోని గోనబావి గ్రామంలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. స్థానికుల వివరాల మేరకు... గ్రామానికి చెందిన శ్రీనివాసులు గోనబావిక్రాస్‌లో చిల్లర దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. దుకాణంలో భార్య అనిత, కుమార్తె మేఘన చికెన్‌ను వండుతున్నారు. అంతలో ఓ ద్విచక్ర వాహనదారుడు వచ్చి లీటర్‌ పెట్రోల్‌ వేయాలని కోరాడు. వెంటనే మేఘన క్యాన్‌లో ఉన్న పెట్రోల్‌ను బాటిల్‌ వేసేందుకు ప్రయత్నించింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో శ్రీనివాసులు, అనిత, మేఘనకు గాయాలపాలయ్యారు. స్థానికులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement